ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆ ప్రభావం వడ్డీ రేట్లపైనా పడుతోంది. దీర్ఘకాలం తీసుకునే రుణాలకు అధిక వడ్డీ చెల్లిస్తే.. మన జేబుపై భారం తప్పదు. 15-20 ఏళ్లు కొనసాగే రుణంపై 25-50 బేసిస్ పాయింట్ల వడ్డీ ఎక్కువగా ఉన్నా.. దాని ప్రభావం అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా ఇంటి రుణాలు తీసుకునేటప్పుడు ఇది తప్పనిసరిగా గమనించాల్సిన అంశం.
రుణదాతను అడగండి..
ఇప్పుడు బ్యాంకులు గృహరుణ వడ్డీ రేట్లను రెపో ఆధారంగానే నిర్ణయిస్తున్నాయి. రెపో రేటుకు, కొంత క్రెడిట్ స్ప్రెడ్‌ను కలిపి వడ్డీ రేటు పేర్కొంటాయి. ఉదాహరణకు.. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 4.90శాతం ఉంది. దీనికి ఒక బ్యాంకు 2.70% క్రెడిట్ స్ప్రెడ్‌ను నిర్ణయిస్తే.. వడ్డీ రేటు 7.60 శాతంగా మారుతుంది. ఈ స్ప్రెడ్ రేటు రుణ వ్యవధి కొనసాగినంత కాలం స్థిరంగా ఉంటుంది. సాధారణంగా ఇది 2.70 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 3.55 శాతం వరకూ వెళ్లొచ్చు. చాలా సందర్భాల్లో బ్యాంకులు తాము ప్రకటనల్లో చెప్పే రేటుకన్నా.. 15-20 బేసిస్ పాయింట్లు తగ్గించి, రుణాలను అందించే అవకాశం లేకపోలేదు. ఇది పూర్తిగా రుణగ్రహీత క్రెడిట్ స్కోరు, చెల్లింపుల తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ఇతర బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని కొత్త బ్యాంకుకు మార్చుకునే సందర్భంలో బేరమాడేందుకు అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలిక బంధం..
సాధారణంగా బ్యాంకులు తమ ఖాతాదారులకు వీలైనన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాయి. మీ వేతనం ఖాతా, పెట్టుబడులు, ఇంతకు ముందే రుణాలు తీసుకోవడం తదితర లావాదేవీలు ఉన్నప్పుడు మీకు ఇతరులతో పోలిస్తే కాస్త తక్కువ వడ్డీకే రుణం రావచ్చు. కొన్నిసార్లు బ్యాంకుతో మీకున్న సంబంధాల ఆధారంగా రుణాలను ముందుగానే మంజూరు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో డిస్కౌంటు వడ్డీ రేటుకే రుణాలను అందించే అవకాశం ఉంది. వ్యక్తిగత, వాహన రుణాలను తీసుకోవాలనుకున్నప్పుడు ఈ మందస్తు మంజూరు రుణాల (ప్రీ అప్రూవ్డ్ లోన్స్) వల్ల ఆదాయ, ఇతర ధ్రువీకరణలు అందించాల్సిన అవసరాలు అంతగా ఉండవు. కొన్నిసార్లు.. ఒకటికి మించి అప్పులు ఒకే బ్యాంకులో తీసుకుంటే.. ఉదాహరణకు ఇంటి, కారు రుణం కోసం ఒకే బ్యాంకులో దరఖాస్తు చేస్తే కాస్త తక్కువ వడ్డీకి అప్పు పొందే వీలుంటుంది. ఒకసారి బ్యాంకుతో ఈ విషయాన్ని చర్చించండి.
వీటినీ గుర్తుంచుకోండి..
- మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అనేదీ రుణ వడ్డీని నిర్ణయించడంలో బ్యాంకులు పరిశీలిస్తాయి. సాధారణంగా ప్రముఖ సంస్థలు, కార్పొరేట్లలో పనిచేస్తున్న వారికి ఈ విషయంలో ఇబ్బంది ఉండదు. సొంతంగా వ్యాపారం, వృత్తి నిర్వహించే వారికి వడ్డీ రేటు కాస్త అధికంగానే ఉంటుంది. కాస్త పరిశోధన చేశాకే బ్యాంకును ఎంచుకోండి.
- మహిళా రుణగ్రహీతలకు బ్యాంకులు కొంత శాతం వడ్డీలో రాయితీని ఇస్తాయి. వీరు ప్రాథమిక రుణ గ్రహీత లేదా సహ-దరఖాస్తుదారులుగానూ ఉన్నా వడ్డీ తగ్గింపును అందిస్తాయి.
- బ్యాంకులు గుర్తించిన డెవలపర్ల దగ్గర ఇల్లు, ఫ్లాటు కొన్నప్పుడు కొంతమేరకు వడ్డీ రాయితీ లభించే అవకాశాలున్నాయి. మీరు కొంటున్న ఆస్తికి ఏ బ్యాంకు రుణం ఇస్తుందో తెలుసుకోండి. వాహన రుణాలకూ ఇదే వర్తిస్తుంది.