How Can Benefit From A Top Up Loan :బ్యాంకులు.. తమ వద్ద లోన్ తీసుకుని, క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న కస్టమర్లకు టాపప్ రుణ సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. అయితే ఇలా ఇచ్చిన టాపప్ రుణాలను, అప్పటికే తీసుకున్న లోన్ మొత్తానికి కలిపేస్తాయి. అందువల్ల మీరు తీసుకున్న రుణ మొత్తం, వ్యవధి రెండూ పెరుగుతాయి.
గుడ్ కస్టమర్లకే టాపప్!
బ్యాంకులు తమ వద్ద రుణం తీసుకుని.. మంచి చెల్లింపుల చరిత్ర ఉన్నవారికి, టాపప్ రుణాలను ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అయితే ఈ టాపప్ ఎంత కల్పిస్తారనేది.. ఆయా బ్యాంకులను అనుసరించి మారుతూ ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్ సహా, అతనికున్న ఆదాయం, అప్పులు, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాలను చూసి, టాపప్ రుణం ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తాయి.
కొత్త దరఖాస్తు అవసరం లేదు!
సింపుల్ ప్రాసెస్‌తో టాపప్ రుణాలను పొందవచ్చు. కొత్తగా దరఖాస్తు పెట్టడం, కీలకమైన పత్రాలను సమర్పించడం లాంటివి ఉండవు. పరిశీలనా రుసుము కూడా వసూలు చేయరు. బ్యాంకులు ఒకసారి టాపప్ రుణం ఇస్తామని చెబితే.. ఎప్పుడైనా సరే దాన్ని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
గృహరుణాలపై టాపప్ ఎంత వస్తుంది?
హోమ్ లోన్ తీసుకొని, కొంత మొత్తం చెల్లించిన తర్వాత.. బ్యాంకులు దానిపై టాపప్ ఇచ్చేందుకు సిద్ధపడతాయి. అయితే సాధారణ గృహరుణంతో పోలిస్తే, ఈ టాపప్ రుణానికి కాస్త అధిక వడ్డీ రేటు ఉంటుంది. అంతేకాదు.. ఈ టాపప్ రుణం తిరిగి చెల్లించాల్సిన వ్యవధి కూడా ప్రాథమిక రుణానికి అనుసంధానమై ఉంటుంది. ఈ-టాపప్ రుణ మొత్తాన్ని.. ఇంటి మరమ్మతులకు, పిల్లల చదువులకు, అధిక వడ్డీ ఉన్న రుణాలను తీర్చేందుకు వాడుకోవచ్చు.
టాపప్ రుణాలను ఎప్పుడు తీసుకోవాలి?
ముందు తీసుకున్న గృహరుణం కంటే.. ఈ టాపప్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కచ్చితంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే గృహరుణాలపై టాపప్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాదు టాపప్ తీసుకోవడం వల్ల పడే అదనపు భారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నెలనెలా సులువుగా ఈఎంఐ చెల్లించగలరా? లేదా? అనేది కూడా చూసుకోవాలి.