తెలంగాణ

telangana

ETV Bharat / business

హోమ్​ లోన్ కావాలా? ఈ టిప్స్ పాటిస్తే లక్షలు ఆదా కావడం గ్యారెంటీ! - Tips to Consider Before Taking a Home Loan

Home Loan Tips And Tricks : సొంతిల్లు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? మీ దగ్గర ఎంత డబ్బుంది? గృహరుణం ఎంత తీసుకోవాలి? ఇలాంటి లెక్కలన్నీ వేసుకున్నారా? ఈ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలతోనే లక్షల రూపాయలు ఆదా చేసుకునేందుకు మార్గం దొరుకుతుంది. అవేమిటి? రుణం తీసుకునేటప్పుడు ఏ విషయాలు చూడాలి? అనేది ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

long term home loan benefits
Home Loan Tips And Tricks

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 4:42 PM IST

Home Loan Tips And Tricks : హోమ్ ​లోన్ ఒక దీర్ఘకాలిక బాధ్యత. మిగతా లోన్స్​తో పోలిస్తే ఇది తక్కువ వడ్డీ రేటుకే లభిస్తుంది. కానీ, వ్యవధి ఎక్కువగా ఉంటుంది కనుక, వడ్డీ భారం పెరుగుతుంది. గృహ రుణం తీసుకునే ముందు చేతి నుంచి కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకింగ్‌ పరిభాషలో దీన్ని డౌన్‌పేమెంట్‌ లేదా మార్జిన్‌ మనీ అని వ్యవహరిస్తుంటారు. గృహరుణం తీసుకునేటప్పుడు మీ ఇంటి విలువలో ఎంత మొత్తాన్ని డౌన్​పేమెంట్​గా చెల్లించాలి. మీకు ఎంత మేరకు రుణం ఇస్తారనే విషయాలను ముందే తెలుసుకోవాలి. మీరు పెద్ద మొత్తంలో డౌన్‌ పేమెంట్‌ చేస్తే, తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ మార్జిన్‌ మొత్తాన్ని చెల్లించేందుకు మనం ఎలా సిద్ధం కావాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

50:30:20 నియమాన్ని పాటించండి
ఆర్థిక ప్రణాళికలో డబ్బు ఆదా చేయడమనేది చాలా కీలకం. అందుకే మీకు వచ్చిన ఆదాయానికి అనుగుణంగా 50:30:20 రూల్​ను పాటించేందుకు ప్రయత్నించండి. ఇందులో భాగంగా, మీ నెలవారీ వేతనంలో 50 శాతాన్ని స్థిరమైన నెలవారీ ఖర్చులకు కేటాయించాలి. 30 శాతం సొమ్మును ఇతర ఖర్చులకు కేటాయించాలి. మిగిలిన 20 శాతాన్ని పొదుపు, మదుపులకు మళ్లించాలి. ఈ నియమాన్ని పాటించడం ద్వారా డౌన్‌పేమెంట్‌కు అవసరమైన మొత్తాన్ని త్వరగా సమకూర్చుకోవడానికి వీలవుతుంది. పెద్ద మొత్తంలో డబ్బును జమ చేయాలంటే పెట్టుబడుల వాటాను క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.

అనవసర ఖర్చులపై నియంత్రణ
మన ఆర్థిక వ్యవహారాల్లో చేసుకునే చిన్న చిన్న మార్పులే రేపు పెద్ద ప్రయోజనాన్ని కలిగిస్తాయి. అందుకే గృహ రుణం తీసుకునే ముందు, రెండు, మూడేళ్లపాటు అనవసర ఖర్చులపై నియంత్రించుకోవాలి. అప్పుడు ఇన్వెస్ట్​మెంట్ల కోసం 30 శాతం లేదా 40 శాతం ఆదాయాన్ని కేటాయించడం సాధ్యమవుతుంది. ఇంటి అద్దె ఎక్కువగా ఉంటే సొంతిల్లు కొనుగోలు చేసేవరకూ చిన్న ఇంటికి మారిపోవాలి. కొత్త వాహనం కొనుగోలును తాత్కాలికంగా వాయిదా వేయండి. విహారయాత్రలను కొన్నాళ్లపాటు వాయిదా వేయండి. ఇవన్నీ కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. కానీ ఇది తాత్కాలికమే అని గుర్తించుకోండి. పెద్ద మొత్తంలో డబ్బును జమ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్న త్యాగాలు తప్పవు.

ఏడాదిలోపు హోమ్​ కొనాలనుకుంటే
ఇంటి కొనుగోలు కోసం మార్జిన్‌ మొత్తాన్ని సాధించడానికి 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు పట్టవచ్చు. మీ ఆర్థిక పరిస్థితికిపై ఇది ఆధారపడి ఉంటుంది. మీరు ఏడాది లోపు ఇళ్లు కొనాలని నిర్ణయించుకుంటే, మీ ఫిక్స్​డ్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు, ఈపీఎఫ్‌ లాంటి వాటి నుంచి డబ్బును వెనక్కు తీసుకోండి. లేదంటే క్రెడిట్‌ కార్డులు, పర్సనల్​ లోన్​లు అందుబాటులో ఉంటాయి. అయితే వీలైనంత వరకు వీటిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇంటి రుణం తీసుకున్న తర్వాత ఇవి మీకు భారంగా మారతాయి.

నష్టాన్ని భరించే శక్తి ఉందా?
నష్టాన్ని భరించే శక్తికి అనుగుణంగా మీ పెట్టుబడులను ఎంచుకోవాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, డెట్‌ ఫండ్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎన్నాళ్లపాటు డబ్బును ఇన్వెస్ట్​మెంట్ చేస్తున్నారు అనేది చూసుకోవాలి. అందుకు అనుగుణంగా పథకాలను ఎంచుకోవాలి. సొంతిల్లు జీవితంలో ఒక కీలక మైలురాయి. దీన్ని సాధించే క్రమంలో ఎలాంటి పొరపాట్లూ చేయకూడదు.

కారు ఇన్సూరెన్స్‌ రెన్యూవల్‌ - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!

అత్యవసరంగా రుణం కావాలా? సిబిల్ స్కోర్​ లేకున్నా లోన్​​ పొందండిలా!

ABOUT THE AUTHOR

...view details