తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీరేట్లు పెరిగాయని బాధపడుతున్నారా? ఇలా చేస్తే కాస్త ఉపశమనం! - ఆర్​బీఐ వడ్డీరేట్లు

Home loan interest rate: ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్​బీఐ ఇటీవల కీలక వడ్డీరేట్లను పెంచింది. ఈ నేపథ్యంలో రుణ రేట్లు పెరగడం లోన్​ తీసుకున్న వారికి ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ టిప్స్​ పాటిస్తే ఆ భారాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు. అలా చేయడం వల్ల వడ్డీ రేట్ల ప్రభావం లేకపోవడం సహా కొంత డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు.

Home loan interest rate
వడ్డీరేట్లు పెరిగాయని చింతిస్తున్నారా?

By

Published : May 18, 2022, 1:44 PM IST

Home loan interest rate: ఇంటి లోన్‌కు సంబంధించిన వడ్డీరేట్లు పెరుగుతున్నాయన్న వార్తలు ఈ మధ్య వినే ఉంటారు. ద్రవ్యోల్బణం పెరగడమే ఇందుకు కారణం. దీన్ని కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను పెంచింది. దీంతో బ్యాంకులు ఆ భారాన్ని రుణదాతలపై మోపుతున్నాయి. రానున్న రోజుల్లో వడ్డీరేట్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇలా రుణ రేట్లు పెరగడం లోన్‌ తీసుకున్నవారికి ఆందోళన కలిగించే విషయమే..!

ముఖ్యంగా కొత్తగా రుణం తీసుకున్న వారికి ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే. కరోనా సమయంలో గృహరుణ రేట్లు కనిష్ఠ స్థాయికి చేరిన సమయంలో వీరంతా లోన్‌ తీసుకొని ఉంటారు. ఈ విషయంలో వారు కొంత ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకొని ఉంటారు. ఉదాహరణకు.. ఓ 30 ఏళ్ల వ్యక్తి తనకు 50 ఏళ్లు వచ్చే సరికి రుణం తీరిపోయేలా లోన్ తీసుకుంటారు. కానీ, ఒకవేళ వడ్డీరేట్లు పెరిగితే.. ఆ సమయం 60 ఏళ్ల వరకు పొడిగించుకోవాల్సి రావొచ్చు. ఇది వారి పూర్తి ఆర్థిక ప్రణాళికను దెబ్బతీస్తుంది.

పాతవారికి ఫరవాలేదు.. పాత రుణగ్రహీతలు అంటే.. కొన్నేళ్ల క్రితం లోన్‌ తీసుకున్నవారు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు మే 2016లో రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు గృహరుణ రేట్లు 9.5 శాతానికి దరిదాపుల్లో ఉన్నాయి. అప్పటి నుంచి రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. కొంతమంది రుణాన్ని పునర్‌వ్యవస్థీకరించి 6.5% వడ్డీరేటుకు మారినవారున్నారు. దీనివల్ల మీ లోన్‌ చెల్లింపు కాలపరిమితి తగ్గి ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ రుణరేట్లు 8 శాతానికి పెరిగినా.. 2016తో పోలిస్తే మీ పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది.

కానీ, కొవిడ్‌ సమయంలో తక్కువ వడ్డీరేటు వద్ద రుణం తీసుకున్నవారి పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. వారి రుణ కాలపరిమితి పెరుగుతుంది. ఉదాహరణకు గత ఏడాది మే నెలలో 6.7 శాతం వద్ద 20 ఏళ్ల కాలపరిమితితో మీరు రుణం తీసుకున్నారనుకుందాం. ఇప్పటి వరకు 13 ఈఎంఐలు చెల్లించి ఉంటారు. ఇంకా 227 వాయిదాలు కట్టాల్సి ఉంటుంది. జూన్‌ 2022 నుంచి రుణరేట్లు 7.1 శాతానికి చేరతాయి. దీంతో మీ రుణ కాలపరిమితి మళ్లీ 243 నెలలకు పెరుగుతంది. అంటే మరో ఏడాదిన్నర పాటు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఏమౌతుంది?.. రేట్ల పెంపు వల్ల రుణభారం అధికమవుతుంది. వచ్చే రెండేళ్లలో వడ్డీరేటు 200 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని అంచనా. క్షీణ దశలో 100 ఈఎంఐల వరకు అధికంగా చెల్లించాల్సి రావొచ్చు. సాధారణంగా రుణ రేట్లు పెరిగినప్పుడు ఈఎంఐల సంఖ్యను సవరిస్తూ ఉంటారు. కట్టే మొత్తాన్ని పెంచుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.. అది భారంగా పరిణమించే అవకాశం ఉంది. అయితే, వడ్డీరేట్లు మరీ ఎక్కువైతే.. ఓ దశ దాటిన తర్వాత ఈఎంఐల సంఖ్యకు బదులు చెల్లించాల్సిన మొత్తాన్నీ పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా రుణం తీసుకున్నవారికి ద్రవ్యోల్బణం పెరుగుదల చేదు వార్తే.

భారం ఇలా తగ్గించుకోండి.. ఇలా రేట్ల పెంపు వల్ల పడే అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సులువైన మార్గాలున్నాయి. వాటిలో ఒకటి '5 శాతం రెడ్యూసింగ్‌ బ్యాలెన్స్‌ మెథడ్‌'. అంటే మీ నెలవారీ ఈఎంఐలతో పాటు ప్రతి ఏడాది అసలులో 5 శాతం ముందస్తు చెల్లింపు చేస్తూ వెళ్లాలి. అసలు తగ్గడం వల్ల భవిష్యత్తులో చెల్లించాల్సిన వడ్డీభారం తగ్గుతుంది. ఏటా 5 శాతం అసలు చెల్లిస్తూ వెళితే.. కాలపరిమితి కూడా తగ్గుతంది. అప్పుడు రేట్ల పెంపు ప్రభావం పెద్దగా కనిపించదు. పైగా తక్కువ వడ్డీ వల్ల కొంత సొమ్ము ఆదా కూడా అవుతుంది. దాన్ని సరైన మార్గంలో పెట్టుబడి పెడితే.. సంపద కూడా వృద్ధి చెందుతుంది.

ఈఎంఐ మొత్తం పెంపు.. రేట్ల పెంపు భారాన్ని దింపుకోవడానికి ఉన్న ఇంకో మార్గం.. ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవడం. ఉదాహరణకు నెలకు మీరు రూ.25,000 చెల్లిస్తున్నట్లయితే.. దాన్ని రూ.35,000 పెంచుకోండి. అదనంగా కడుతున్న రూ.10,000 అసలు కిందకు వెళతాయి. ఫలితంగా ఏటా రూ.1.2 లక్షల అసలు తగ్గిపోతుంది. ఇది ఈఎంఐలో చెల్లించే అసలుకు అదనం. అలా ఆదాయం పెరిగిన ప్రతిసారీ ఈఎంఐ మొత్తాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే ఉత్తమం.

పునర్‌వ్యవస్థీకరిస్తే.. మార్కెట్‌తో పోలిస్తే మీరు అధికంగా వడ్డీ చెల్లిస్తున్నారని అనిపిస్తే లోన్‌ రీఫైనాన్స్‌ (రుణ పునర్‌వ్యవస్థీకరణ)కు వెళితే ఉత్తమం. ఈ విషయంపై మీరు రుణం తీసుకున్న సంస్థతో చర్చించాలి. అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఒప్పుకోకపోతే.. రుణ బదిలీ ప్రత్యామ్నాయాన్ని పరిశీలించాలి. అయితే, మీ వడ్డీరేటు 0.5 శాతం కంటే ఎక్కువ తగ్గితేనే రుణ బదిలీ మేలు. లేదంటే ప్రయోజనం తక్కువే.

మెరుపు దాడి వ్యూహం.. ద్రవ్యోల్బణం ఊహించిన కంటే వేగంగా అదుపు తప్పి.. వడ్డీరేట్లు వేగంగా పెరిగితే.. పైన తెలిపిన రెండు మార్గాలు అంతగా పనిచేయకపోవచ్చు. అలాంటప్పుడు మెరుపుదాడి వ్యూహాన్ని అనుసరించాలి. ఉదాహరణకు మీరు 6.7 శాతం వడ్డీరేటుతో రూ.50 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. 13 ఈఎంఐలు చెల్లించిన తర్వాత వడ్డీరేటు 7.1 శాతానికి పెరిగింది. అప్పుడు 227కు తగ్గిన ఈఎంఐలు తిరిగి 243కు చేరతాయి. అయితే, ఈ సంఖ్యను తిరిగి 227కు తీసుకురావడమే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం. దీనికి ఉన్న ఏకైక మార్గం ఒకేసారి రూ.1.75 లక్షల అసలు ను చెల్లించడమే. ఫలితంగా బాకీ ఉన్న అసలు మొత్తం తగ్గి తిరిగి మీ ఈఎంఐల సంఖ్య 226కు చేరుతుంది. దీనివల్ల వడ్డీభారం తగ్గతుంది. ఇలా వడ్డీరేట్లు భారీగా పెరిగిన ప్రతిసారీ ఈఎంఐల సంఖ్యను కుదించడానికి ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో అసలును చెల్లిస్తే.. అదనంగా చెల్లించాల్సిన వడ్డీ మిగిలిపోతుంది. ఫలితంగా మీరకున్న సమయంలో మీ రుణం తీరిపోతుంది.

ఇదీ చూడండి :'పెట్రోల్‌ ధర.. శ్రీలంక, పాకిస్థాన్‌ కంటే భారత్‌లోనే ఎక్కువ'

ABOUT THE AUTHOR

...view details