తెలంగాణ

telangana

ETV Bharat / business

సొంతిల్లు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - home loan credit score check

Home Loan Precautions: సొంతిల్లు.. అందరి కల. చాలామంది ఈ కలను నెరవేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంటి కొనుగోలు కోసం రుణం తీసుకోవడం ఇప్పుడు సులభమే. ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు పరిశీలించాల్సిన అంశాలు చాలానే ఉంటాయి. చిన్న పొరపాటు చేసినా.. మీ ఇతర ఆర్థిక లక్ష్యాలన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే సొంతిల్లు కొనాలనుకునే వారు కొన్ని ప్రశ్నలకు ముందుగా సమాధానం తెలుసుకోవాలి. ఆ తర్వాతే అడుగు ముందుకు వేయాలి..

home loan precautions
home loan precautions

By

Published : May 20, 2022, 2:33 PM IST

Home Loan Precautions: గృహరుణం.. దీర్ఘకాలం కొనసాగే బాధ్యత. ఈ వ్యవధిలో ఎన్నోసార్లు వడ్డీ రేట్లు పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. కాబట్టి, రుణం తీసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే.. ఆ రుణ భారం తగ్గి, ఇతర లక్ష్యాల సాధనాల సులువు అవుతుంది. రుణ మొత్తం ఎంత తీసుకోవాలి? ఎంత వ్యవధి ఎంచుకోవాలి? వాయిదాల చెల్లింపులో ఇబ్బందులు ఉంటాయా? ఇలా పలు విషయాలనూ విశ్లేషించుకోవాలి. వీటితోపాటు..

ఎందుకోసం?:ఇల్లు ఎందుకు కొంటున్నారు? మీరు అందులో నివసిస్తారా? లేకపోతే పెట్టుబడి దృష్టితోనా? మీ సొంతానికి అయితే.. మీ కుటుంబ అవసరాల కోసం ఇల్లు ఎలా ఉండాలి? ఎంత విస్తీర్ణంలో అవసరం.. సౌకర్యాల మాటేమిటి? మీ చుట్టుపక్కల ఉన్న వసతులు, అభివృద్ధికి ఉన్న అవకాశాలు.. ఇలాంటివన్నీ చూడాలి. కేవలం పెట్టుబడి దృష్టితో చూసినప్పుడు.. మీరు పెట్టిన పెట్టుబడికి ఎంత మేరకు ప్రతిఫలం రావచ్చు.. వృద్ధి ఎలా ఉంటుంది.. అద్దె ఆదాయంలాంటివి పరిశీలించాలి. ఒకసారి ఈ అంశాలన్నీ విశ్లేషించుకున్నాకే.. మీరు నిర్ణయం తీసుకోండి. అదే సమయంలో పన్ను పరమైన ప్రయోజనాలనూ బేరీజు వేసుకోవడం తప్పనిసరి.

అందుబాటులో ఉందా?:మంచి పేరున్న ప్రాంతంలో.. అన్ని హంగులతో ఉన్న ఇల్లు కావాలని ఇల్లు కొనాలని చాలామంది అనుకుంటారు. కానీ, మన ఆర్థిక శక్తి అందుకు సరిపోకపోవచ్చు. ఇల్లు కోసం ఎంత ఖర్చు చేయగలం అనేది ముందు లెక్క వేసుకున్నాకే.. మిగతా విషయాలను ఆలోచించాలి. అంచనాలకూ.. వాస్తవాలకూ ఎంతో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు. భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో.. ఇప్పుడు కొంత అధిక రుణం తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఇది సరికాదు. ఇల్లు కొన్నప్పటి నుంచి అది మీకు భారంగా మారొద్దు.. మీరు అనుకున్న మొత్తానికే ఇల్లు తీసుకోవాలన్న నిర్ణయాన్ని మార్చుకోవద్దు. అనవసరంగా పెద్ద మొత్తం అప్పు చేసి, భవిష్యత్తులో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు.

చేతిలో నగదు..:ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు మన చేతి నుంచి కొంత మొత్తం చెల్లించాల్సి వస్తుంది. దీన్నే మార్జిన్‌ మనీ అంటారు. బ్యాంకులు ఇంటి విలువలో సాధారణంగా 75-90శాతం వరకూ రుణాన్ని అందిస్తాయి. మిగతాది మనం సమకూర్చుకోవాలి. దీంతో పాటు రిజిస్ట్రేషన్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌లాంటి ఖర్చులూ అదనం. రుణగ్రహీత వయసు, క్రెడిట్‌ స్కోరు, రుణ మొత్తం, ఇంటి విలువలో రుణ శాతం తదితరాల ఆధారంగా మార్జిన్‌ మనీని నిర్ణయిస్తారు. మీరు ఎంత మేరకు ఈ డబ్బును సమకూర్చగలరో ముందే లెక్క వేసుకోండి. మీ ఇతర ఆర్థిక లక్ష్యాలను ప్రభావితం చేసేలా చేతిలో ఉన్న మొత్తం డబ్బును దీనికోసం వెచ్చించకూడదు.

క్రెడిట్‌ స్కోరు..:ప్రస్తుతం చాలా బ్యాంకులు గృహరుణ వడ్డీ రేట్లను రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరు ఆధారంగా నిర్ణయిస్తున్నాయి. క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్న వారికి గరిష్ఠ వడ్డీని విధిస్తున్నాయి. కాబట్టి, అధిక వడ్డీ రేటు ఉండకూడదు అనుకుంటే.. మీ క్రెడిట్‌ స్కోరును జాగ్రత్తగా నిర్వహించండి. 750-800 మధ్య మంచి స్కోరుగా పరిగణిస్తారు. కేవలం రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడే కాదు.. రుణం తీరేంత వరకూ క్రెడిట్‌ స్కోరుకు ఇబ్బంది రాకుండా చూసుకోండి.

నెలవారీ వాయిదాలు..:ముందే అనుకున్నట్లు.. గృహరుణం ఒక దీర్ఘకాలిక బాధ్యత. ఈ రుణానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇప్పటికే మీకున్న ఇతర అప్పులెన్ని.. వాటికి చెల్లిస్తున్న వాయిదాల మొత్తం ఎంత? భవిష్యత్తులో ఇతర అప్పులేమైనా తీసుకోవాల్సి వస్తుందా? చూసుకోండి. ఇప్పటికే ఉన్న రుణాలు మీ చెల్లింపు శక్తిని తగ్గిస్తాయి. భవిష్యత్తులో పిల్లల చదువుల కోసం విద్యారుణం లాంటివి తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. కొత్త రుణం తోడైనప్పుడు మీపై ఈఎంఐల భారం అధికంగా ఉంటుంది. మీ ఖర్చులు, ఇతర బాధ్యతలను బట్టి.. గృహరుణం ఎంత వస్తుంది అని కాకుండా.. మీరు ఎంత ఈఎంఐ భరించగలరు అనేదాన్ని బట్టి, రుణ మొత్తాన్ని నిర్ణయించుకోవడం ఉత్తమం. ఆ తర్వాత.. తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ ఫీజు ఉన్న బ్యాంకులను ఎంచుకోండి.

ఆదాయం మాటేమిటి?:గృహరుణానికి దరఖాస్తు చేసేముందు ఆర్థికంగా ఎంత మేరకు సిద్ధం అనే ప్రశ్న వేసుకోవాలి. రుణం కొనసాగినన్ని రోజులు మీకు క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందా? చూసుకోవాలి. ఒకటికి మించి ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నించాలి. మీ ఆదాయం.. ఇతర అంశాల ఆధారంగా రుణం తక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు.. సహ దరఖాస్తుదారు అవసరం పడుతుంది. జీవిత భాగస్వామి సహదరఖాస్తుగా ఉండొచ్చు. ఉమ్మడిగా రుణానికి దరఖాస్తు చేసినప్పుడు అప్పు అర్హత పెరుగుతుంది. మహిళలకు వడ్డీ రేట్లలోనూ కొంత రాయితీ లభిస్తుంది.

బీమా తప్పనిసరి..:కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేది బీమా. గృహరుణం తీసుకున్నప్పుడు ఆ మేరకు జీవిత బీమా పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దు. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే.. ఆ బీమా పాలసీతో రుణం తీరిపోయేలా ఏర్పాట్లు ఉండాలి. టర్మ్‌ పాలసీ లేదా.. హోంలోన్‌ ప్రొటెక్షన్‌ పాలసీలను ఇందుకోసం ఎంపిక చేసుకోవచ్చు.

ఇతర లక్ష్యాల కోసం..:ఇల్లు కొనడం ముఖ్యమే. కానీ, దీనికోసం ఇతర ఆర్థిక లక్ష్యాలను నిర్లక్ష్యం చేయడం తగదు. పదవీ విరమణ ప్రణాళిక, పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహంలాంటి అవసరాలనూ చూసుకోవాలి. మీ ఆర్థిక స్వేచ్ఛను గృహరుణం హరించి వేయకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుందని అనిపిస్తే.. సొంతిల్లు విషయాన్ని మరోసారి ఆలోచించాలి. లేదా బడ్జెట్‌ తగ్గించుకోవాలి. మీ ఇతర లక్ష్యాలకు ఇబ్బందులు ఎదురు కావు.. ఆ విధంగా మీ ఆదాయాన్ని సర్దుబాటు చేయగలరు అనుకున్నప్పుడే గృహరుణం తీసుకోవడం మంచిది.

ఇదీ చదవండి:వడ్డీరేట్లు పెరిగాయని బాధపడుతున్నారా? ఇలా చేస్తే కాస్త ఉపశమనం!

ABOUT THE AUTHOR

...view details