Home Loan Mortgage Reducing Term Assurance : మనలో చాలా మందికి సొంత ఇళ్లు కట్టుకోవడం ఒక కల. అందుకే అప్పు చేసి అయినా ఇళ్లు కట్టుకోవాలని ఆశపడుతూ ఉంటాం. ఇందుకోసం బ్యాంకుల నుంచి గృహరుణం కూడా తీసుకుంటాం. అయితే దీనికి దీర్ఘకాలంపాటు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మనం ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని కూడా సంరక్షించుకోవాల్సి ఉంటుంది. అందుకే గృహరుణం తీసుకున్నవారు కచ్చితంగా తనఖా బీమా (మార్టిగేజ్ రెడ్యూసింగ్ టెర్మ్ అస్యూరెన్స్) పాలసీని తీసుకోవడం మంచిది. దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అనూహ్య పరిస్థితుల్లో..
MRTA Benefits : మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేము. కొన్ని సార్లు ఇవి వ్యక్తుల ఆర్థిక జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. దురదృష్టవశాత్తు ఇంటి యజమాని మరణిస్తే.. అతనిపై ఆధారపడిన కుటుంబానికి అర్ధాంతరంగా ఆదాయం ఆగిపోతుంది. రుణ వాయిదాలు చెల్లించడం చాలా కష్టమవుతుంది. ఒకవైపు రుణ భారం, మరోవైపు కుటుంబ ఖర్చులు.. ఆర్థికంగా వారిని కృంగదీస్తాయి. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించకపోతే.. బ్యాంకులు ఇంటిని స్వాధీనం చేసుకుంటాయి. ఇలాంటి అనుకోని సమస్యలను అధిగమించాలంటే.. గృహరుణం తీసుకునేటప్పుడే, తప్పనిసరిగా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. దురదృష్టవశాత్తు రుణ గ్రహీత మరణించిన సందర్భంలో బీమా కంపెనీ.. ఆ గృహ రుణం మొత్తాన్ని తీర్చేస్తుంది. అప్పుడు అతని కుటుంబం ఆర్థికంగా చాలా సురక్షితంగా ఉంటుంది.
తీసుకున్న రుణానికి తగినట్లుగా బీమా
Housing Loan Insurance : హోమ్ లోన్ తీసుకున్నప్పుడు దానికి రక్షణగా మార్టిగేజ్ రెడ్యూసింగ్ టెర్మ్ అస్యూరెన్స్ (ఎంఆర్టీఏ) పాలసీని తీసుకోవడం మంచిది. వాస్తవానికి ఇది సాధారణం టెర్మ్ పాలసీలానే పనిచేస్తుంది. దురదృష్టవశాత్తు రుణ గ్రహీత మరణించినప్పుడు ఇంటి రుణాన్ని బీమా సంస్థ తీరుస్తుంది. ఫలితంగా కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సురక్షితంగా ఉంటుంది.
వాస్తవానికి పాలసీ విలువ నేరుగా గృహరుణం మొత్తానికి సర్దుబాటు అయ్యి ఉంటుంది. గృహరుణం కొనసాగినన్ని రోజులు ఈ బీమా రక్షణ కల్పిస్తుంది. వాయిదాలు సకాలంలో చెల్లిస్తూ ఉంటే, ఇంటి రుణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఆ మేరకు బీమా పాలసీ విలువ సర్దుబాటు అవుతూ ఉంటుంది. హోమ్ లోన్ ఇస్తున్నప్పుడే.. బ్యాంకులు లేదా గృహరుణ సంస్థలు ఈ పాలసీని తీసుకోమని సూచిస్తాయి. తమతో ఒప్పందం ఉన్న బీమా కంపెనీల నుంచి పాలసీని అందిస్తాయి.