Home Loan Fixed Vs Floating Interest Rate : గృహ, వాహన సహా ఇతర రుణాలపై అధిక వడ్డీ రేట్ల బాదుడుతో ఇబ్బంది పడుతున్న రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తాము తీసుకున్న రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల నుంచి స్థిర వడ్డీ రేట్లకు మారేందుకు అవకాశాన్ని కల్పించే విధంగా ఉండే నూతన విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల(Fixed Interest Rates In India)ను త్వరలోనే విడుదల చేస్తామని ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షపై ప్రకటన సందర్భంగా గురువారం ఉదయం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. త్వరలో అమలులోకి రానున్న ఈ విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను రుణదాతలు (బ్యాంకులు, రుణసంస్థలు) క్లుప్తంగా తమ వినియోగదారుకు లేదా రుణగ్రహీతలకు వివరించాలని ఆయన సూచించారు.
ఫిర్యాదులు అందినందునే..
Home Loan Fixed Or Floating :హోమ్ లోన్స్, వెహికిల్ లోన్స్ సహా ఇతర రుణాల గడువు విషయంలో వినియోగదారుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని.. ఇందులో రుణదాతలు కస్టమర్లతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండానే ఇష్టానుసారంగా ఫ్లోటింగ్ రేట్ల లోన్ల కాలవ్యవధిని పెంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారని గవర్నర్ చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ స్థిర వడ్డీ రేటు నూతన ఫ్రేమ్‌వర్క్‌ను రుణగ్రహీతల కోసం తెస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
"బ్యాంకులు, రుణసంస్థలు అనుసరిస్తున్న తీరుపై మాకు ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. రుణదాతలు తమ(రుణగ్రాహీతలు)కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఫ్లోటింగ్ రేట్ రుణాల గడువును అనూహ్యంగా పొడిగిస్తున్నాయని మాకు వారు సమాచారం ఇచ్చారు. వీటిని అరికట్టేందుకే ఈ స్థిర వడ్డీ రేటు విధానాన్ని తేనున్నాం."