తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇంటి బీమా తీసుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - ఇన్సూరెన్స్ పాలసీ

Home insurance policy: జీవితంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇల్లు ఒకటి. దీనికి చిన్న నష్టం కలిగినా చాలామంది తట్టుకోలేరు. గృహరుణం తీసుకునేటప్పుడు.. దానికి అనుబంధంగా లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీని తీసుకుంటారు. రుణగ్రహీతకు ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఈ పాలసీ రుణాన్ని చెల్లించేందుకు తోడ్పడుతుంది. కానీ, నిర్మాణానికీ, ఇంట్లోని వస్తువులకు జరిగిన నష్టానికి బాధ్యత వహించదు. దీనికోసం ప్రత్యేకంగా గృహ బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

ఇంటి బీమా
ఇంటి బీమా

By

Published : May 15, 2022, 5:34 PM IST

Home insurance policy: ఇల్లు, అందులోని వస్తువులకు ఏదైనా నష్టం సంభవించినప్పుడు ఆర్థికంగా ఆ నష్టాన్ని భర్తీ చేసేదే గృహ బీమా. ఇందులోనూ రెండు రకాలున్నాయి. ఒకటి.. ఇంటిలో ఉన్న వస్తువులకు రక్షణ కల్పించే కంటెంట్‌ ఇన్సూరెన్స్‌. ఇందులో విద్యుత్‌ ఉపకరణాలు, ఫర్నిచర్, ఆభరణాలు తదితర వాటికి రక్షణ లభిస్తుంది. మరో రకం నిర్మాణానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పరిహారం చెల్లించే స్ట్రక్చర్‌ ఇన్సూరెన్స్‌. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆస్తికి నష్టం వాటిల్లితే పరిహారం ఇస్తుంది. ఈ పాలసీలను తీసుకోవడం తప్పనిసరేం కాదు. గృహరుణం తీసుకునేటప్పుడు ఈ బీమా పాలసీని తీసుకోవాల్సిందిగా కొన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు చెబుతుంటాయి. ఇది కేవలం సూచనగా మాత్రమే పరిగణించాలి. తీసుకోవాలన్న నిబంధన ఎక్కడా లేదు.

మీ ఇల్లు ఎక్కడ ఉంది అనేదాన్ని బట్టి, ఏ తరహా పాలసీ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉన్నప్పుడు స్ట్రక్చరల్‌ హోం ఇన్సూరెన్స్‌ పాలసీని ఎంచుకోవాలి. ఇలాంటి ఇబ్బందులు లేనప్పుడు కంటెంట్‌ ఇన్సూరెన్స్‌ సరిపోతుంది. ఏ రకం పాలసీ తీసుకున్నా... ముందుగా అందులో వర్తించేవి ఏమిటి? మినహాయింపులు ఉన్నాయా? అన్నది చూసుకోవాలి. మార్కెట్లో ఉన్న వివిధ పాలసీలను పోల్చి చూసుకోవాలి. ప్రీమియం, అందిస్తున్న ప్రయోజనాలు పరిశీలించాలి.

ఎంత మొత్తానికి..ఇంటికి ఎంత విలువైన పాలసీ తీసుకోవాలన్నదీ ముఖ్యమే. ముందు ఆస్తి విలువను లెక్కించాలి. దీనికోసం నిపుణులను సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు కంటెంట్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని అనుకుంటుంటే.. వస్తువుల జాబితా తయారు చేసుకోండి. వాటి విలువ ఎంతుంటుందో చూసుకోండి. ఆ వస్తువు పోతే.. దాని వల్ల మీకు జరిగే ఆర్థిక నష్టాన్ని అంచనా వేయాలి. దీన్ని బట్టి, మీ వస్తువుల విలువ ఎంత అనేది ఒక అంచనా వస్తుంది. తరుగు తర్వాత వస్తువు విలువ లేదా వస్తువును కొనుగోలు చేయడానికి అవసరమైన మొత్తం.. ఈ రెండింటిలో ఏది కావాలన్నదీ నిర్ణయించుకోవచ్చు.

  • ఇంటి విలువ ఏటా మారుతూ ఉంటుంది. కొత్త వస్తువులు వచ్చి చేరుతూ ఉంటాయి. కాబట్టి, ఏటా ఈ పాలసీని సమీక్షించుకుంటూ ఉండాలి. దీనివల్ల వాస్తవ విలువకన్నా.. మీ గృహ బీమా తగ్గకుండా ఉంటుంది.

ఈ పొరపాటు చేయొద్దు..గృహ బీమా పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థకు ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకండి. మీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు బీమా ప్రతిపాదిత పత్రంతో పాటు జత చేయండి. వస్తువుల గురించి పూర్తి సమాచారం అందించండి. బిల్లులను ఆధారాలుగా ఉంచుకోండి. మీ అవసరాలను బట్టి, గృహబీమాకు పలు అనుబంధ పాలసీలనూ జోడించుకోవచ్చు. వాటినీ పరిశీలించండి.

ఇదీ చూడండి :క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలా? ఇవి ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details