తెలంగాణ

telangana

ETV Bharat / business

విక్రయానికి రూ.70,000 కోట్లు విలువ చేసే షేర్లు.. కొనేదెవరు? - ambuja cements

సిమెంట్​ దిగ్గజ కంపెనీలైన అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో వాటా విక్రయించడానికి హోల్సిమ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు కంపెనీల్లో హోలిమ్స్​ వాటా విలువ రూ.70,000 కోట్లు కాగా.. ఆ నిధులు సమకూర్చుకోవడం అతిపెద్ద సవాలుగా మారనుంది. ఒకేవేళ ఇది పూర్తయితే అతిపెద్ద కార్పొరేట్‌ డీల్‌గా ఘనత సాధించనుంది.

holcim-to-sell-stake-in-ambuja-cements-and-acc
రూ.70,000 కోట్లు విలువ చేసే వాటాలు విక్రయించేందుకు హోల్సిమ్‌ సన్నాహాలు

By

Published : Apr 23, 2022, 8:44 AM IST

దేశీయ సిమెంటు రంగానికి చెందిన రెండు అతిపెద్ద కంపెనీలైన అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ లిమిటెడ్‌లలో తన వాటా విక్రయించేందుకు స్విస్‌ సంస్థ హోల్సిమ్‌ సిద్ధం కావడం దేశ కార్పొరేట్‌ వర్గాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ కంపెనీలేమీ

చిన్నవేమీ కాదు. ఉత్పత్తి సామర్థ్యం, ఆదాయాల పరంగా దేశీయ సిమెంటు రంగంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న దిగ్గజ కంపెనీలు. స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ ఈ రెండు కంపెనీలకు యజమానిగా ఉంది. హోల్సిమ్‌ గత కొంత కాలంగా వివిధ దేశాల్లో తనకు ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకుంటోంది. ఇందులో భాగంగా అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో తనకు ఉన్న మెజార్టీ వాటాను విక్రయించేందుకు కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద కంపెనీలను కొనగలిగేది ఎవరు, ఏ కార్పొరేట్‌ సంస్థలకు అంత సామర్థ్యం ఉందనేది తెలియాల్సి ఉంది. ఈ రెండు కంపెనీల్లో హోల్సిమ్‌ వాటాను కొనుగోలు చేయాలంటే దాదాపు 9.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.70,000 కోట్లు) కావాలి. అంత సొమ్ము సమకూర్చుకోవడం ఎలా.. అనేది కూడా అతిపెద్ద ప్రశ్న.

రూ.70,000 కోట్లు విలువ చేసే వాటాలు విక్రయించేందుకు హోల్సిమ్‌ సన్నాహాలు

వాటాలు ఇలా: ఏసీసీ లిమిటెడ్‌ ప్రమోటర్‌ అంబుజా సిమెంట్స్‌ కాగా, హోల్సిమ్‌కు అంబుజా సిమెంట్స్‌ లిమిటెడ్‌లో 63.19 శాతం వాటా ఉంది. అంటే ఒకటి ప్రత్యక్షంగా, మరొకటి పరోక్షంగా హోల్సిమ్‌కు చెందిన కంపెనీలే. ఈ రెండు కంపెనీలు స్టాక్‌మార్కెట్లో నమోదై ఉన్నాయి. అంబుజా సిమెంట్స్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ.74,322 కోట్లు ఉంది. ఇందులో హోల్సిమ్‌ వాటా విలువ రూ.46,000 కోట్ల వరకు ఉంటుంది. ఈ వాటా విక్రయిస్తే, తదుపరి సెబీ నిబంధనల ప్రకారం ఈ కంపెనీలోని సాధారణ వాటాదార్ల నుంచి మరో 25 శాతం షేర్లు కొనుగోలు చేయడం కోసం తప్పనిసరిగా ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాల్సి వస్తుంది. ఆమేరకు నిధులు కేటాయించాలి.

  • ఏసీసీ లిమిటెడ్‌లో హోల్సిమ్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న వాటా విలువ మరో రూ.23,000 కోట్లకు పైగానే ఉంది. మొత్తం మీద చూస్తే ఈ రెండు కంపెనీల్లో హోల్సిమ్‌కు ఉన్న వాటాను కొనుగోలు చేయాలంటే ఈ కంపెనీల ప్రస్తుత షేరు ధరల ప్రకారం దాదాపు రూ.70,000 కోట్లకు పైగానే (దాదాపు 9.5 బిలియన్‌ డాలర్లు) కావాలి. విక్రయ వ్యవహారం ఖరారయ్యే దశలో స్టాక్‌మార్కెట్లో షేరు ధరలు పెరగొచ్చు. అదే జరిగితే ఇంకా ఎక్కువ నిధులు పెట్టాల్సి వస్తుంది.
  • ఇంత సొమ్ము సమకూర్చుకుని ముందుకు రాగల కార్పొరేట్‌ సంస్థలు మనదేశంలో వేళ్ల మీద లెక్కించగల సంఖ్యలోనే ఉన్నాయి. అందుకే ఈ కంపెనీలను కొనుగోలు చేయడం అంటూ జరిగితే.. దేశ కార్పొరేట్‌ చరిత్రలో అతిపెద్ద డీల్‌గా రికార్డులకు ఎక్కుతుంది.

విదేశీ నిధుల కోసం యత్నం:విదేశీ ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడి సంస్థల నుంచి కొంత మేరకు నిధులు సమకూర్చుకుని, ఈ కంపెనీలను హోల్సిమ్‌ నుంచి కొనుగోలు చేయడానికి మనదేశంలోని కొన్ని అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థలు కసరత్తు చేస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తమ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలని చూస్తున్న శ్రీ సిమెంట్స్‌, దాల్మియా భారత్‌, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఈ వ్యవహారంపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల కాలంలో శరవేగంగా విస్తరిస్తున్న అదానీ గ్రూపు సిమెంటు రంగంపైనా దృష్టి సారించింది. అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలకు రుణ భారం లేదు. పైగా నగదు నిల్వలు ఉన్న కంపెనీలు. దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌, ఎంతో బ్రాండు విలువ ఉన్న సంస్థలు. అందువల్ల అదానీ గ్రూపు వీటిని దక్కించుకుంటే ఒక్కసారిగా సిమెంటు రంగంలో అగ్రస్థానానికి చేరువైనట్లు అవుతుంది.

రూ.70,000 కోట్లు విలువ చేసే వాటాలు విక్రయించేందుకు హోల్సిమ్‌ సన్నాహాలు
రూ.70,000 కోట్లు విలువ చేసే వాటాలు విక్రయించేందుకు హోల్సిమ్‌ సన్నాహాలు

ఇదీ చదవండి:క్రెడిట్, డెబిట్​ కార్డ్స్​కు కొత్త రూల్స్.. అలా జరిగితే కస్టమర్​కు రోజుకు రూ.500!

ABOUT THE AUTHOR

...view details