Gautam Adani Hindenburg Report : హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి మండిపడ్డారు. అదానీ వ్యాపారాలకు సంబంధించి హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక కేవలం తప్పుడు సమచారం అందించడమే కాకుండా తమను అపఖ్యాతి పాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు.
పూర్తిగా దురుద్దేశపూరితమైన నివేదిక..
Hindenburg Research Adani Group : అదానీ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో వాటాదారులను ఉద్దేశించి గౌతమ్ అదానీ మంగళవారం ప్రసంగించారు. "భారత చరిత్రలోనే అతిపెద్ద ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ (ఎఫ్‌పీఓ)ను ప్రారంభించేందుకు మేం సిద్ధపడుతున్న వేళ.. హిండెన్‌బర్గ్ ఈ నివేదికను ప్రచురించింది. తప్పుడు సమాచారం, నిరాధార ఆరోపణలతో ఆ నివేదికను తయారు చేసింది. ఇందులోని ఎక్కువ శాతం వివరాలు 2004 నుంచి 2015 మధ్య నాటివేనని.. ఆ సమయంలో ఉన్న లోటుపాట్లను అప్పుడు అధికారులు పరిష్కరించారు. మా ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా మా స్టాక్ ధరలను తగ్గించి లాభాలను ఆర్జించాలన్న లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అది." అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. వాటిని ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుంచి తమ ప్రతిష్ఠను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడానికి హిండెన్‌బర్గ్ తప్పుడు నివేదిక తయారు చేసిందని ఆయన ఆరోపించారు. మొత్తంగా హిండెన్‌బర్గ్ నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితమని.. ఆ కమిటీ ఇచ్చిన నివేదికతో షేర్‌హోల్డర్లలో విశ్వాసం మరింత పెరిగిందని ఆయన అన్నారు.
అదానీ గ్రూప్ సంస్థలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.