తెలంగాణ

telangana

ETV Bharat / business

60% తగ్గిన గౌతమ్ అదానీ సంపద.. టాప్​ ప్లేస్​కు ముకేశ్​ అంబానీ! - అదానీ లేటెస్ట్ న్యూస్

హిండెన్​బర్గ్ ఇచ్చిన నివేదిక ప్రభావంతో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్​ అదానీ సంపద భారీగా క్షీణించింది. ఆయన తన సంపదలో సుమారు 60 శాతం మేర నష్టపోయారని M3M హూరూన్​ గ్లోబల్​ రిచ్​ లిస్ట్ నివేదిక ద్వారా వెల్లడైంది.

adani wealth
adani wealth

By

Published : Mar 22, 2023, 7:17 PM IST

షేర్ల ధరల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ హిండెన్​బర్గ్ ఇచ్చిన నివేదికతో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద భారీగా క్షీణించింది. ఆయన తన సంపదలో సుమారు 60 శాతం మేర కోల్పోయారు. అదానీ గతేడాదిలో ప్రతి వారం సుమారు రూ. 3,000 కోట్లు నష్టపోయారని M3M 'హూరూన్​ గ్లోబల్​ రిచ్​ లిస్ట్' నివేదించింది. ఫలితంగా మార్చి మధ్యలో వరకు అదానీ ఆస్తిని 53 బిలియన్​ డాలర్లు నిర్ధరించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్​ అధినేత ముకేశ్​ అంబానీ దేశంలో అత్యంత ధనవంతుడి స్థానాన్ని దక్కించుకున్నారు.

అదానీతో పాటు అంబానీ సంపద విలువ కూడా పడిపోయింది. ప్రపంచ కుబేరులు జాబితాలో అదానీ 11 స్థానాలు పడిపోయి 23వ స్థానం వద్ద ఉన్నారు. అంబానీ 9 వ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే గత 10 ఏళ్లలో వీరి వ్యాపారాన్ని పరిశీలిస్తే.. భారీగా లాభపడ్డారు. అదానీ సంపద 1,225 శాతం పెరగగా.. అంబానీ సంపద 356 శాతం మేర ఎగబాకిందని 'హూరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్' ఓ నివేదిక ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 187 డాలర్ల బిలియనీర్లు నివసిస్తున్నారని.. గతేడాదితో పోల్చితే ఇది 15 శాతం అధికమని చెప్పింది. ఈ సంపన్నుల్లో 66 మంది దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనే నివసిస్తున్నారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను పరిశీలిస్తే.. వీరిలో 217 మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల ఆదాయంలో భారత్​ 5 శాతాన్ని ఆక్రమించింది. అమెరికా 32 శాతం, చైనా 25 శాతంగా ఉంది.

సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ అధినేత సైరస్​ పూనావాలా 27 బిలియన్​ డాలర్లతో వైద్యరంగంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఏషియన్​ పెయింట్స్​ యజమాని అయిన అశ్విన్​ దానీ కుటుంబం 7.1 బిలియన్ డాలర్లతో ఆ రంగంలో.. బైజు రవీంద్రన్​ 3.3 బిలియన్ డాలర్లతో విద్యారంగంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. మరోవైపు భారత్​లో 10 మంది మహిళా బిలియనీర్లు ఉన్నారని.. వారిలో రాధా వేంబు 4 బిలియన్​ డాలర్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.

ఇదీ జరిగింది..
దేశీయ స్టాక్ మార్కెట్లలో షేర్ల ధరల్లో అదానీ గ్రూప్​ అవకతవకలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. అమెరికా న్యూయార్క్​కు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్​బర్గ్​ జనవరి 24న ఓ నివేదికను విడుదల చేసింది. ఫలితంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఎదురుదాడికి దిగిన అదానీ గ్రూప్​.. హిండెన్​బర్గ్ సంస్థ​పై ప్రతి ఆరోపణలు చేసింది. కావాలనే తమను దెబ్బకొట్టానికే చేశారని ఆరోపిస్తూ.. హిండెన్​బర్గ్​ సంస్థను 'అనైతిక షార్ట్​ సెల్లర్​'గా అభివర్ణించింది. ఆ నివేదకలో చేసిన ఆరోపణలన్నీ అబద్దాలే అని తిప్పికొట్టింది. వారి నివేదికకు ప్రతిగా జనవరి 29న 413 పేజీల రిపోర్టును అదానీ గ్రూప్​ వెలువరించింది. అందులో 'ఇది అదానీ గ్రూప్​పై కాదు.. ఇండియాపై దాడి'గా అభివర్ణించింది. దీనిపై స్పందించిన హిండెన్​బర్గ్​.. దేశం ముసుగులో తప్పించుకోలేరని హితవు పలికింది.

ఇవీ చదవండి :అమెజాన్ ఉద్యోగులకు మరోసారి షాక్.. 9,000 మందికి ఉద్వాసన

ఈ కార్లపై భారీ డిస్కౌంట్.. మరో 10 రోజులే ఛాన్స్.. తర్వాత కొందామన్నా దొరకవ్!!

ABOUT THE AUTHOR

...view details