Most Demanding Job Oriented Courses : ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్స్ పేరిట వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కొత్త నియామకాలను నిలిపేశాయి. దీంతో.. తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి చాలా మంది అవస్థలు పడుతున్నారు. అయితే.. కొన్ని రంగాల్లో మాత్రం నియామకాలు జరుగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను లిస్ట్ ఔట్ చేస్తున్నారు నిపుణులు. ఆ కోర్సులు నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ అంటున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Demanding Job Oriented Courses : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో నియామకాలు అంతంత మాత్రంగానే ఉంటున్నప్పటికీ.. కొన్ని విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో.. ఈఆర్‌పీ (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్), ఆటోమోటివ్ డిజైన్, టెస్టింగ్, ఆడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న వారికి అపార ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు.. బిజినెస్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో వెల్లడించింది.
ఈ మధ్య కాలంలో.. మొదటిసారిగా పెద్ద ఐటీ కంపెనీల్లో సిబ్బంది సంఖ్య, గైడెన్స్ తగ్గిందని.. రాబోయే రోజుల్లో ఆచితూచి అడుగులు వేయాలని ఐటీ పరిశ్రమ సమష్టిగా నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. పరిస్థితి మళ్లీ మెరుగుపడేంత వరకూ.. ఒకటి, రెండు త్రైమాసికాలపాటు ఇదే అనిశ్చితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
నైపుణ్యాలతోనే అవకాశాలు..
సంస్థలు తమ వ్యాపార నిర్వహణ విధానాలను మార్చుకుంటున్నాయని, రాబోయే రెండేళ్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై 85 శాతం పైగా ఇన్వెస్ట్ చేయాలని భారత టెక్ కంపెనీలు ఆలోచిస్తున్నాయని చెబుతున్నారు. కొత్త స్కిల్స్ నేర్చుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతోందని, జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో.. భారత దేశంలోని ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెబుతున్నారు.