ఆరోగ్య బీమా పాలసీ అమల్లో ఉన్నప్పుడే క్లెయింలను బీమా సంస్థ ఆమోదిస్తుంది. ఏటా ఈ పాలసీని పునరుద్ధరించుకోవాలి. కొన్నిసార్లు పాలసీదారులు ఈ పాలసీ పునరుద్ధరణలో ఆలస్యం చేస్తుంటారు. లేదా మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భంలో క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు పాలసీ నుంచి పరిహారం అందదు. చాలామంది దీన్ని క్లెయిం చేసుకున్న తర్వాతే గుర్తిస్తారు. పాలసీ సకాలంలో పునరుద్ధరించుకోకపోతే.. బీమా కంపెనీకి క్లెయిం చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. ఇలాంటి అనుభవాలు లేకుండా చూసుకునేందుకు గడువు తేదీలోగా పాలసీని పునరుద్ధరించుకోవడం మేలు.
సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీ గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణ కోసం 15 నుంచి 30 రోజుల అదనపు వ్యవధినిస్తారు. కానీ, వ్యవధిలో క్లెయిం వచ్చినా పరిహారం లభించదు. కేవలం కొనసాగింపు ప్రయోజనాలు దూరం కాకుండా ఉంటాయి.
దాపరికం వద్దు..
పాలసీ తీసుకునేటప్పుడు దరఖాస్తు పత్రంలో ఇప్పటికే ఉన్న వ్యాధుల గురించి తెలియజేయాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహంలాంటి విషయాలను పేర్కొనాలి. గతంలో ఏదైనా పెద్ద శస్త్రచికిత్స జరిగితే.. ఆ వివరాలూ తెలియజేయాలి. పాలసీ పునరుద్ధరించుకునేటప్పుడు.. ఆ పాలసీ ఏడాదిలో ఏదైనా అనారోగ్యం బారిన పడటం, లేదా రక్తపోటు, మధుమేహం రావడంలాంటివి ఉంటే.. దానిని పునరుద్ధరణ సమయంలో బీమా సంస్థకు చెప్పాలి. ఆరోగ్య బీమా విషయంలో మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయమూ ఎంతో కీలకమే. చిన్న పొరపాటు చేసినా, బీమా సంస్థ దాన్ని కారణంగా చూపి, క్లెయింను తిరస్కరించేందుకు వీలుంటుంది. ముందస్తు వ్యాధులకు.. శాశ్వత మినహాయింపును ఇవ్వడం ద్వారా పాలసీని జారీ చేయొచ్చు. కొన్నిసార్లు పాలసీ ఇవ్వడంలో ఇదే కీలకంగానూ ఉంటుంది.
వేచి ఉండే వ్యవధి..
బీమా పాలసీ తీసుకున్న తర్వాత కొన్ని వ్యాధులకు నిర్ణీత వేచి ఉండే సమయం (వెయిటింగ్ పీరియడ్) ఉంటుంది. ఈ లోపు ఆ వ్యాధి చికిత్స కోసం క్లెయిం చేసుకుంటే దాన్ని బీమా సంస్థ ఆమోదించకపోవచ్చు. బీమా సంస్థలను బట్టి, ఈ వేచి ఉండే వ్యవధిలో తేడా ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే ఈ నిబంధన గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఏయే వ్యాధులకు, ఎంత కాలం పరిహారం ఇవ్వరు అనేది పాలసీ పత్రంలో ఉంటుంది. దీన్ని పూర్తిగా చదివి, అర్థం చేసుకోవాలి.