తెలంగాణ

telangana

ETV Bharat / business

తల్లిదండ్రులకు ధీమాగా ఆరోగ్య బీమా.. 'పేరెంట్స్ ​డే' గిఫ్ట్​గా ఇచ్చేయండి మరి! - ఆరోగ్య బీమా పాలసీ వార్తలు

Health Insurance For Parents: ఆరోగ్య బీమానా.. ఇప్పుడు దీనితో నాకేం అవసరం.. ఏటా ప్రీమియం వృథా తప్ప.. ఒకప్పుడు ఈ పాలసీ గురించి ఆలోచనలు ఇలాగే ఉండేవి. కానీ, మహమ్మారి ఈ దృక్పథాన్ని మార్చేసింది. దీని అవసరం చాలామంది గుర్తించారు. ముఖ్యంగా పెద్దలకు ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు. ఈ రోజు(జులై 24) పేరెంట్స్‌ డే.. మరి మీరూ అమ్మానాన్నలకు ఓ బీమాను బహూకరించండి..

Health Insurance For Parents
Health Insurance For Parents

By

Published : Jul 24, 2022, 8:00 AM IST

Health Insurance For Parents: ఉద్యోగుల ప్రయోజనం కోసం ఎన్నో యాజమాన్యాలు బృంద ఆరోగ్య బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. ఇందులో ఉద్యోగి కుటుంబంతోపాటు, వారి తల్లిదండ్రులకూ దీన్ని వర్తింపజేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ వెసులుబాటును ఇవ్వడం లేదు. బృంద బీమా ఉన్నా.. లేకున్నా.. పెద్దల కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత పాలసీ తీసుకోవడం ఎప్పుడూ మంచిదే.

మన కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసుంటారు. వారి విశ్రాంత జీవితంలో అన్ని విధాలుగా వారికి అండగా నిలవడం ఇప్పుడు మన బాధ్యత. ఎలాంటి సందర్భంలోనైనా వారికి తగిన ఆర్థిక రక్షణ లభించే ఏర్పాటు ఉన్నప్పుడు వారూ ఇబ్బంది పడకుండా ఉండగలరు. పెద్దలకు ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, వారికి ఎప్పుడూ ధీమాగా ఉండేలా ఆరోగ్య బీమా పాలసీని తోడుగా ఉంచాలి. ఇదే వారికి మీరిచ్చే పెద్ద బహుమతి.

నమ్మకమైన సంస్థతో..
ప్రస్తుతం పలు బీమా సంస్థలు పెద్దలకు వ్యక్తిగతంగానూ, పిల్లల పాలసీల్లో తల్లిదండ్రులకూ రక్షణ కల్పిస్తున్నాయి. చాలా పాలసీలు ఒకే తరహా ప్రయోజనాలను అందిస్తున్నాయి. వీటిలో మనకు ఏది సరిపోతుందో ఎలా తెలుసుకోవడం? ఇదే ఇక్కడ పెద్ద చిక్కు ప్రశ్న. తల్లిదండ్రుల కోసం బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఆయా బీమా సంస్థలు అందిస్తున్న సేవల గురించి ఆరా తీయండి. క్లెయిం చెల్లింపుల తీరు, బీమా సంస్థ పనితీరును తెలుసుకోండి. కొద్దిగా పరిశోధిస్తే ఈ వివరాలు దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. క్లెయిం చెల్లింపుల తీరు తెలుసుకునేందుకు ఐఆర్‌డీఏఐ వెబ్‌సైటునూ చూడొచ్చు.

సరైన మొత్తానికి..
వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికం అవడం సహజం. కొన్నిసార్లు మధుమేహం, అధిక రక్తపోటులాంటి జీవన శైలి వ్యాధులూ ఉండొచ్చు. కాబట్టి, పెద్దల కోసం పాలసీని ఎంచుకునేటప్పుడు ఇలాంటి వాటినీ దృష్టిలో పెట్టుకోవాలి. తక్కువ వేచి ఉండే వ్యవధి, మానసిక వ్యాధుల చికిత్సకూ వర్తింపు, వార్షిక వైద్య పరీక్షలు, రోజువారీ చికిత్సల్లాంటికీ వర్తించాలి. కొన్ని బీమా సంస్థలు అదనంగా విలువ ఆధారిత సేవలను అందిస్తుంటాయి. వీటినీ పరిశీలించాలి. క్రిటికల్‌ ఇల్‌నెస్‌, ఓపీడీ కవర్‌, గది అద్దె విషయాల్లో ఎలాంటి ఉపపరిమితులూ లేని పాలసీని ఎంచుకోవాలి. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, సరైన మొత్తానికి బీమా విలువ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ఆసుపత్రుల జాబితా..
ఆరోగ్య బీమా పాలసీలు నగదు రహిత చికిత్సను అందిస్తాయి. కాబట్టి, మీరు ఎంచుకునే పాలసీకీ మీకు దగ్గర్లో ఉన్న ఆసుపత్రులతో ఒప్పందం ఉందా లేదా చూసుకోండి. పేరున్న ఆసుపత్రులు, స్పెషాలిటీ హాస్పిటళ్లూ నెట్‌వర్క్‌ జాబితాలో ఉండాలి. నగదు రహిత చికిత్స ఉండటం వల్ల మీరు దూర ప్రాంతాల్లో ఉన్నా.. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చికిత్స అందుతుంది.

పునరుద్ధరణ విషయంలో..
ఆరోగ్య బీమా పాలసీలు జీవితాంతం వరకూ ఉపయోగపడేవి. కాబట్టి, వీటి పునరుద్ధరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండకుండా చూసుకోవాలి. పెద్దల పేరుమీద తీసుకున్న పాలసీలను గడువులోగా రెన్యువల్‌ చేయించాలి. అప్పుడే వారికి అన్ని వేళలా ఆ పాలసీ రక్షణగా ఉంటుంది. తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించే ప్రీమియానికి మీరు సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు. తల్లిదండ్రులు 60 ఏళ్లలోపు ఉన్నప్పుడు రూ.25,000 వరకూ, 60 ఏళ్లు దాటితే రూ.50వేల వరకూ మినహాయింపు వర్తిస్తుంది.

క్లెయిం చెల్లింపులు..
ఆసుపత్రిలో చేరినప్పుడు క్లెయింల చెల్లింపులు సులభంగా జరిగిపోవాలి. పూర్తిగా డిజిటల్‌ విధానంలో క్లెయింలను నిర్వహించే బీమా సంస్థలను పరిశీలించాలి. క్లెయింల పరిష్కారంలో పూర్తి పారదర్శకంగా ఉండాలి. పాలసీ పత్రాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించండి. మినహాయింపుల గురించి అర్థం చేసుకోండి. తక్కువ మినహాయింపులున్న పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి.

- రాఘవేంద్ర రావు, చీఫ్​ డిస్ట్రిబ్యూషన్​ ఆఫీసర్​, ఫ్యూచర్​ జెనెరాలి ఇండియా ఇన్సూరెన్స్​

ఇవీ చదవండి:వరదల్లో పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా?

అదరగొట్టిన ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌.. లాభాలు 50శాతం జంప్

ABOUT THE AUTHOR

...view details