Metaverse technology: మెటావర్స్.. భవిష్యత్‌ను మార్చే పదమిది. మనం ఉన్నచోటే ఉండి.. ఎక్కడికో వెళ్లి అక్కడి అనుభూతులను స్వయంగా అనుభవించేలా చేసేదే ఇది. త్వరలోనే ఇటువంటి సేవలకు సిద్ధమని హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ అంటోంది. ఇప్పటికే రెండు కంపెనీల కోసం ఈ సేవలను అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటోంది. వచ్చే కొద్ది నెలల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించగలమని వార్తా సంస్థ 'ఇన్ఫామిస్ట్'కిచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రోడక్ట్ ఇంజినీరింగ్ సేవల అధిపతి జోసెఫ్ అనంతరాజు తెలిపారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు..
- ఐటీ కంపెనీలు మెటావర్స్ విభాగంలో ఏం చేస్తున్నాయి. చాలా వరకు ప్రారంభ దశలోనే ఉండడం వల్ల ఎంత మేర అవి వాస్తవ రూపంలోకి వస్తాయన్నది తెలియట్లేదు కదా?
మా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీధర్ మంతా కింద టెక్నాలజీ మండలి ఒకటి ఉంది. అది ఈ విభాగాలను పర్యవేక్షిస్తోంది. రెండు చిన్న బృందాలు కూడా ఈ సాంకేతికతలను అర్థం చేసుకోవడంపై పనిచేస్తున్నారు. బ్లాక్‌చైన్, ఆగుమెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ వంటివాటిని అర్థం చేసుకున్నాయి కూడా. ఆ నైపుణ్యంతో కొన్ని డెమోలను సిద్ధం చేశారు. వీటి ద్వారా వినియోగదార్లకు వాటిని అర్థమయ్యేలా చెబుతున్నాం. ఏదైనా ప్లాట్‌ఫాం లేదా ఫ్రేమ్‌వర్క్‌లను మేం నిర్మించడానికి ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. ఇదింకా ప్రారంభ దశే కాబట్టి దానిపై ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ పరిశీలన జరుపుతున్నాం.
ఇక కొంత మంది వినియోగదార్లతో కలిసి పనిచేస్తున్నాం. వారి పరిశ్రమ లేదా కంపెనీకి కావాల్సిన అవసరాలను 'మెటావర్స్'లో మాకున్న అనుభవనాల ద్వారా తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం తయారీ నుంచి ఒకరు, ఆరోగ్య రంగం నుంచి మరొక క్లయింట్లతో చర్చల్లో ఉన్నాం. వచ్చే త్రైమాసికంలో వారికి సేవలను అందించగలం. లాజిస్టిక్ రంగమైనా లేదంటే స్థిరాస్తి పరిశ్రమ అయినా.. ఉన్నత విద్యలోనైనా సరే.. బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతికతను వినియోగించాలంటే విశ్వాసం ఉండాలి. ఎందుకో తెలియడం లేదు కానీ అది ఇంకా కనిపించడం లేదు. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్‌లోనైనా ఈ సాంకేతికతలను నేటి తరం యువత అందిపుచ్చుకుంటుంది.
- మెటావర్స్ వినియోగం ద్వారా ఇంట్లో కూర్చునే స్థిరాస్తి సందర్శన చేయొచ్చా. ఆటోమేషన్ ఇతర రంగాల్లోనూ సాధ్యమవుతుందా?
స్థిరాస్తి, వాహన రంగంలో ఏదైనా కొనుగోలును ఎక్కడో కూర్చుని, చూసి చేయాలి అనుకుంటే.. ఫర్నిచర్‌ను లేదా కారును తాకి ఆ అనుభవం పొందేలా చేయాల్సి ఉంటుంది. దీనిని మెటావర్స్ ద్వారా సాధించొచ్చు. ఇటువంటివి పలు రంగాల్లో ఉండేలా మేం అభివృద్ధి చేస్తున్నాం. ఇవి గూగుల్ క్లాస్ లేదా ఓక్యులస్ వంటి డివైజ్‌ల ద్వారా వినియోగదార్ల చెంతకు చేర్చే అవకాశాలను పరిశీలిస్తున్నాం. లేదంటే ల్యాప్‌టాప్‌ల వంటి అందరికీ వీలైన పరికరాల ద్వారా అందించాలనీ అనుకుంటున్నాం. అయితే ఇటువంటివి ఎంత మంది దగ్గర ఉంటాయన్నది చూసుకుని చేస్తాం.
- ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభం లేదా స్థూల ఆర్థిక అంశాలపై మీ క్లయింట్లు ఏమైనా ఆందోళన చెందుతున్నారా? కొత్త ఒప్పందాలపై నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభావం ఉంటోందా