తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు వేల సంఖ్యలో కాలనీలు జలమయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన చాలా కార్లు నీటిమునిగాయి. ఇంకొన్ని బురదలో చిక్కుకున్నాయి. అయితే నీళ్లు తగ్గాక వాహనాలను సర్వీస్ సెంటర్లకు తీసుకెళ్తున్నారు యజమానాలు. వీటి రిపేరుకు భారీగా డబ్బు వెచ్చించాల్సి వస్తోందని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ వాహనాలకు బీమా వర్తిస్తుందా? లేదా? అనేది వాహనాదారుల మదిని తొలుస్తున్న ప్రశ్న. ఒకవేళ బీమా వర్తిస్తే ఏ మేరకు ఉపశమనం కలుగుతుంది? అసలు కారు మామూలు రీతికి వస్తుందా అనేది ఇప్పుడు వాటి యజమానులను వేధిస్తోన్న ప్రశ్నలు.
సాధారణంగానే వాహనాలకు సంబంధించి చిన్న చిన్న రిపేర్లకు ఎక్కువగా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం వరదల వల్ల కార్లలో చాలా భాగాలు పాడైపోయే ఆస్కారం ఉంది. వరదలు ప్రారంభమైనప్పటి నుంచి సర్వీస్ సెంటర్లకు.. నీటిలో మునిగిన వాహనాలే ఎక్కువగా వస్తున్నాయి. 95 శాతానికి పైగా వాహనాలు వరదల్లో మునిగినవి లేక వరదల వల్ల దెబ్బతిన్నవే ఉంటున్నాయని సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు చెబుతున్నారు. వీటికి సంబంధించి రిపేరు, సర్వీసింగ్‌కు కూడా చాలా సమయం పడుతోంది. ఒకేసారి భారీగా వాహనాలు సర్వీస్ సెంటర్ల వద్ద క్యూ కట్టడం వల్ల ఇలా జరుగుతోందని వారు చెబుతున్నారు. వాహనం నీటిలో మునిగిన తీరు ఆధారంగా కొన్ని వర్గీకరణలు చేశారు సర్వీస్ సెంటర్ల నిర్వాహకులు.
వర్గీకరణలు ఇలా..:మొత్తం నీటిలో మునిగిన వాహనాన్ని సీ కేటగిరీగా, సీట్ స్థాయి వరకు మునిగిన వాహనాన్ని బీ కేటగిరీగా, కార్పెట్ వరకు మునిగిన వాహనాన్ని ఏ కేటగిరీగా విభజిస్తున్నారు. ఎక్కువగా సీ కేటగిరీ వాహనాలే సర్వీస్ సెంటర్లకు చేరుతున్నాయి. బీమా సంస్థలను సంప్రదించి, క్లెయిమ్‌ను పరిగణనలోకి తీసుకొని రిపేర్, సర్వీసింగ్ పూర్తి చేయటానికి సమయం పడుతోంది. ఏ కేటగిరీ వాహానం 3 నుంచి 5 రోజులు, బీ కేటగిరీ వాహనాలకు దాదాపు 3 వారాలు, సీ కేటరిగీ వాహనాలకు ఇంకా ఎక్కువ సమయం పడుతున్నట్లు సర్వీస్ సెంటర్ల ప్రతినిధులు చెబుతున్నారు.
బీమాల్లో రకాలెన్ని..?:వాహనాల్లో చిన్న చిన్న రిపేర్లకే చాలా ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు వరదల వల్ల వాహనాల్లో ఎలాంటి డ్యామేజీ జరిగింది? ఎంత వరకు ఖర్చువుతుంది? బీమా క్లెయిమ్ అవుతుందా? లేదా? అన్నది వాహనదారులను కలవరపెడుతోంది. వాహనదారులు తీసుకున్న బీమాను బట్టి క్లెయిమ్ అవుతోందని వాహన బీమా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వాహనానికి సంబంధించి బీమాలో పలు రకాలుంటాయి.
మొదటికి థర్ట్ పార్టీ. ఈ బీమాలో వాహన డ్యామేజీకి సంబంధించి ఎలాంటి బీమా ఉండదు. ఇది కేవలం వాహనం వల్ల ఇతరులకు, ఇతర వాహనాలకు కలిగిన డ్యామేజీకి మాత్రమే వర్తిస్తుంది. బీమా రెగ్యులేటరీ ప్రకారం రోడ్డుపై తిరిగే ఏ వాహనానికైనా థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. దీనితో దాదాపు అన్ని వాహనాలపై థర్డ్ పార్టీ బీమా ఉంటుంది.