Packaged Food GST: ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న నిర్ణయం.. రాష్ట్రాల అభ్యర్థన మేరకే తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వ్యాట్ ద్వారా కోల్పోయే ఆదాయాన్ని పూడ్చేందుకే జీఎస్టీ విధించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిది కాదని, జీఎస్టీ మండలిదేనని కేంద్ర ఆర్థిక శాఖ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. మండలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో పాటు మంత్రులు భాగమేనని గుర్తుచేశారు.
"జీఎస్టీ అమలులోకి రాకముందు చాలా రాష్ట్రాల్లో 'వ్యాట్' ఉండేది. ఆహార పదార్థాలపై వ్యాట్ విధించడం ద్వారా రాష్ట్రాలు ఆదాయాన్ని సంపాదించేవి. బ్రాండెడ్ ప్యాకింగ్ ఉత్పత్తులపైనే పన్ను విధించాలని జీఎస్టీ మార్గదర్శకాల్లో ఉంది. అయితే, అందులోని లొసుగులను ఉపయోగించుకొని కొన్ని పేరున్న కంపెనీలు సైతం.. పన్నును తప్పించుకుంటున్నాయి. దీనిపై రాష్ట్రాలు కూడా మాకు సమాచారం ఇచ్చాయి. జీఎస్టీకి ముందు తమకు చాలా ఆదాయం వచ్చేదని, ఇప్పుడు దాన్ని కోల్పోతున్నామని చెప్పాయి. మంత్రుల బృందం, ఫిట్మెంట్ కమిటీ, జీఎస్టీ మండలి చర్చలు జరిపి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకుంది."
-తరుణ్ బజాజ్, రెవెన్యూ కార్యదర్శి