GST On Diesel Vehicles :డిజిల్ వాహనాలపై 10 శాతం అదనంగా జీఎస్టీ విధించాలని ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. ముఖ్యంగా కాలుష్య పన్ను (పొల్యూషన్ టాక్స్) రూపంలో 10 శాతం మేర అదనంగా జీఎస్టీ విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కాలుష్యం తగ్గించాల్సిందే!
దిల్లీలో జరిగిన భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశలో డీజిల్ జనరేటర్లు సహా, డీజిల్ వాహనాలపై 10 శాతం అదనపు సుంకాన్ని విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ ఇవ్వనున్నట్లు గడ్కరీ చెప్పారు.
డీజిల్ వాహనాలే ఎందుకు?
దేశంలో ఎక్కువ శాతం వాణిజ్య వాహనాలు డిజీల్‌తోనే నడుస్తున్నాయి. దీని వల్ల కాలుష్యం పెరుగుతోంది. అందుకే డీజిల్ వాహనాల తయారీని పూర్తిగా నిలిపివేయాలని గడ్కరీ కోరారు. లేనిపక్షంలో భారీగా పన్నులు పెంచుతామని ఆయన హెచ్చరించారు. అలాగే కాలుష్య రహిత ఇంధనాలైన.. ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలను కోరారు.
'ఆటోమొబైల్ పరిశ్రమ కచ్చితంగా డీజిల్ వాహనాల ఉత్పత్తిని తగ్గించాలని కోరుతున్నాను. ఒకవేళ మీరు వాహన ఉత్పత్తిని తగ్గించకుంటే కచ్చితంగా అదనపు పన్ను విధించాల్సి ఉంటుంది. అప్పుడు వాహనాలు విక్రయించడం మరింత కష్టమవుతుంది. వాస్తవానికి దేశంలో ఇప్పటికే డీజిల్ కార్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే వాహన తయారీ సంస్థలు వాటి ఉత్పత్తిని మరింత తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పర్యావరణానికి డీజిల్ వల్ల తీవ్రమైన హాని కలుగుతోంది. మరోవైపు వీటి వల్ల చమురు దిగుమతుల బిల్లూ పెరుగుతోంది. అందువల్ల పర్యావరణహితమైన వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని ఆటోమొబైల్ సంస్థలను కోరుతున్నాను.'
- నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి
నష్టాల్లో ఆటోమొబైల్ స్టాక్స్!
గడ్కరీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలైన మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. వాస్తవానికి ప్రయాణికుల వాహన విభాగంలో మారుతి సుజుకి, హోండా లాంటి కంపెనీలు ఇప్పటికే డీజిల్ కార్ల తయారీని నిలిపివేశాయి. కానీ దేశంలోని కమర్షియల్ వాహనాలన్నీ డీజిల్‌తోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం వాహనాలకు 28 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. వాహన రకాన్ని అనుసరించి 1-22 శాతం వరకు అదనపు సెస్సు విధిస్తున్నారు. ఎస్‌యూవీలకు గరిష్ఠంగా 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్సు వసూలు చేస్తున్నారు.