GST Five Years: దేశ చరిత్రలోనే అతి పెద్ద పన్నుల సంస్కరణ అయిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధానం నిన్నటితో (జూన్ 30) అర్ధ దశాబ్దాన్ని పూర్తి చేసుకుంది. బాలారిష్టాలతో మొదలైన దీని ప్రయాణం ఆ తర్వాత ఎన్నో మార్పు చేర్పులకు లోనైంది. ఈ కొత్త పరోక్ష పన్నుల విధానంపై ఆరంభంలో వ్యాపారులు, వినియోగదారుల్లో చాలా గందరగోళం నెలకొంది. పన్ను రిటర్న్‌ల దాఖలులో సమస్యలు, ఏ వస్తువుకు జీఎస్‌టీ వర్తిస్తుంది? వేటికి మినహాయింపు ఉంది? అనే విషయంలో అయోమయం సహా పలు రకాల ఇబ్బందులకు కేంద్ర బిందువు అయ్యింది. అయితే వీటిల్లో చాలా వరకు ప్రభుత్వం ప్రస్తుతం పరిష్కరించింది. రిటర్న్‌ల ప్రక్రియను సరళీకరించడంతో పాటు పలు రకాల ఉత్పత్తులకు జీఎస్‌టీ రేట్లను మార్పు చేసింది.
జీఎస్‌టీపై అవగాహన పెంచే కార్యక్రమాలనూ చేపట్టింది. జీఎస్‌టీకి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. పన్ను పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకొని వచ్చేందుకు, పారదర్శకతకూ ఈ పన్నుల విధానం దోహదపడింది. పన్నుల ఎగవేతకు చాలా వరకు అడ్డుకట్ట పడింది. అంతేకాదు.. ప్రస్తుతం నెలకు రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్‌టీ వసూలు కావడం సర్వసాధారణమైంది. గత నాలుగు నెలలుగా (ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే) రూ.1.40 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలవుతూ వస్తోంది. జూన్‌లోనూ ఇదే ఒరవడి కొనసాగే అవకాశం ఉందని అంచనా.
అలా ఆరంభమై.. 2017 జులై 1న దేశవ్యాప్తంగా జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చింది. జీఎస్‌టీలో ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, వ్యాట్ సహా 17 రకాల పన్నులను, 13 సెస్సులను విలీనం చేశారు. దీని వల్ల ప్రజలకు పన్ను మీద పన్ను చెల్లించాల్సిన భారం తప్పినట్లయ్యింది. జీఎస్‌టీ విధానంలో 4 పన్ను రేట్ల శ్లాబులు (5%, 12%, 18% 28%) ఉన్నాయి. జీఎస్‌టీకి ముందు పన్ను మీద పన్ను చెల్లించాల్సి వస్తుండటంతో ఓ వినియోగదారు సగటున 31 శాతం వరకు పన్ను కట్టాల్సి వచ్చేదని అంచనా. ఈ నాలుగు పన్ను రేట్లు కాకుండా పసిడి, ఆభరణాలు, ఖరీదైన రాళ్లపై ప్రత్యేకంగా 3 శాతం; కోసిన, మెరుగుపెట్టిన వజ్రాలకు 1.5 శాతం మేర జీఎస్‌టీ రేటు విధిస్తున్నారు.
విలాసవంత వస్తువులు, హానికారక ఉత్పత్తులపై అత్యధిక జీఎస్‌టీ రేటు 28 శాతంతో పాటు సెస్సు కూడా విధిస్తున్నారు. సెస్సు రూపంలో వసూలయ్యే డబ్బులను పరిహార నిధిలో జమ చేస్తున్నారు. జీఎస్‌టీ అమలు కారణంగా రాష్ట్రాలకు వాటిల్లుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ పరిహార నిధిలో జమ చేసిన నిధులను వాడుతున్నారు. అయితే ఐదేళ్ల వరకు మాత్రమే రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారాన్ని చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. జూన్ 30తో ఈ గడువు కూడా ముగిసింది. కరోనా పరిణామాలతోనే రెండేళ్లు గడిచినందున పరిహారం చెల్లింపును కొనసాగించాలంటూ చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయి. దీనిపై ఆగస్టు మొదటివారంలో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.