GST On Online Gaming : బెట్టింగ్ వీరులకు షాక్ ఇచ్చింది జీఎస్టీ మండలి. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని బెట్టింగ్ ముఖ విలువ (బెట్టింగ్ అమౌంట్)పై వసూలు చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం జీఎస్టీ మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటితో పాటు అరుదైన వ్యాధుల చికిత్సలో వినియోగించే ఆహారం (ఫూడ్ ఫర్ స్పెషల్ మెడికల్ పర్పసెస్-FSMP), క్యాన్సర్ ఔషధం డైనటుక్సిమాబ్ (Dinutuximab)కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చామని వెల్లడించారు. ప్రైవేటు కంపెనీల ఉపగ్రహ ప్రయోగ సేవలనూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు చెప్పారు. సినిమా హాళ్లలో విక్రయించే ఆహారం, పానీయాలపై పన్ను 18శాతం కాకుండా 5శాతం విధించనున్నామని తెలిపారు.
Group Of Ministers GST : ఆన్‌లైన్ గేమింగ్ విషయంలో గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అనే తేడాను తొలగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు మహారాష్ట్ర అటవీ, సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. అప్పిలేట్ ట్రైబ్యునళ్ల ఏర్పాటుకు కూడా మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్ గేమింగ్‌పై తొలుత ముఖ విలువ మీద పన్ను వేయాలా? గేమింగ్ ఆదాయంపై పన్ను వేయాలా? ప్లాట్‌ఫామ్ ఫీజు మీద మాత్రమే పన్నువేయాలా? అనేది ఇటీవల సమావేశమైన ఆర్థిక మంత్రులు కమిటీ.. చర్చించింది. అనంతరం వీటిపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ మండలికి సిఫార్సు చేస్తూ నివేదిక సమర్పించింది.