GST Slabs: జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని కేంద్రం ప్రస్తుతం పరిహారం కింద చెల్లిస్తోంది. ఈ ప్రక్రియకు జూన్‌తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు ఇకపై నిధుల కోసం కేంద్రంపై ఆధారపడకుండా.. స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో జీఎస్టీ మండలి పలు మార్పులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు వచ్చే నెల జరగనున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి తెలిపారు.
5 శాతం శ్లాబు రెండు భాగాలుగా:ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్నాయి. దీంట్లో 5 శాతం శ్లాబును పూర్తిగా ఎత్తివేయాలనే ప్రతిపాదనను మండలి పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిధిలో ఉండి.. సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న కొన్ని వస్తువులను 3 శాతం పన్ను పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. మరికొన్నింటిని 8 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిత్యావసర వస్తువులన్నీ అతి తక్కువ పన్ను శ్లాబైన ఐదు శాతం పరిధిలో ఉన్నాయి. విలాస వస్తువులకు 28 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. కొన్ని అత్యంత విలాసవంతమైన వస్తువులు, 'సిన్ గూడ్స్'పై అదనంగా సెస్ కూడా విధిస్తున్నారు. ఫలితంగా వచ్చిన ఆదాయాన్ని జీఎస్టీ అమలు వల్ల నష్టపోతున్న రాష్ట్రాలకు పరిహారంగా అందజేస్తున్నారు.
ప్యాక్ చేయని, బ్రాండెడ్ కాని ఆహార, డైరీ ఉత్పత్తులకు ప్రస్తుతం జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తోంది. అలాగే మరికొన్నింటిపైనా జీఎస్టీ మినహాయింపు కొనసాగుతోంది. అయితే, వీటిలో కొన్నింటిని మూడు శాతం పన్ను శ్లాబులో చేర్చాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదు శాతం శ్లాబును 7, 8 లేదా 9 శాతానికి పెంచాలనే ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.