తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎస్టీ మోత.. హోటల్ వసతులపై 12%.. ఆస్పత్రుల గదులపై 5% - tax on hotel rooms gst council

GST council decision: హోటల్​లో రూ.వెయ్యి లోపు గదిని అద్దెకు తీసుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్! ఇకపై ఆ గదుల అద్దెలు భారీగా పెరగనున్నాయి. ఇదివరకు పన్ను మినహాయింపు పొందుతున్న ఈ సేవలపై 12 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఈ మేరకు మంగళవారం భేటీ అయిన జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. మరిన్ని కీలక ప్రతిపాదనలనూ ఆమోదించింది. అవేంటంటే?

GST-TAX-RATES
GST-TAX-RATES

By

Published : Jun 28, 2022, 7:25 PM IST

Updated : Jun 28, 2022, 8:33 PM IST

GST council meeting: జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. పలు వస్తువులపై పన్ను రేట్లను సవరించింది. మరికొన్ని వస్తువులపై పన్ను మినహాయింపులను ఎత్తివేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం భేటీ అయిన జీఎస్టీ మండలి.. పన్నుల హేతుబద్ధీకరణ, డ్యూటీ విధానాలు, పన్ను విధానాన్ని సరళీకృతం చేసే అంశాలపై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం సిద్ధం చేసిన మధ్యంతర నివేదికను ఆమోదించింది. బంగారం, విలువైన రాళ్ల అంతర్​రాష్ట్ర రవాణాపై 'ఈ-వే' బిల్లులను జారీ చేసేందుకు రాష్ట్రాలకు అనుమతించింది. విలువ ఎంత మొత్తం దాటితే ఈ-వే బిల్లులు జారీ చేయాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని మండలి సూచించగా.. దాన్ని రూ.2లక్షలుగా నిర్ణయించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది.

మంత్రుల బృందం ప్రతిపాదనలు ఇవే...

  • రోజుకు రూ.వెయ్యి రుసుము లోపు ఉంటే హోటల్ వసతులపై పన్ను మినహాయింపులను తొలగించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఈ సేవలపై 12 శాతం పన్ను విధించాలని సూచించింది.
  • ఆస్పత్రిలో రోగులకు ఇచ్చే గదుల (ఐసీయూలు మినహా) అద్దెపై 5శాతం జీఎస్టీ విధించాలని ప్రతిపాదించింది. రోజుకు రూ.5వేల కన్నా అధికంగా ఉండే గదులకు ఈ పన్ను వర్తింపజేయాలని పేర్కొంది.
  • పోస్ట్ ఆఫీస్ సేవలపైనా పన్ను విధించాలని మంత్రుల బృందం సూచించింది.
  • చెక్కులపై 18 శాతం పన్ను విధించాలని ప్రతిపాదించింది.
  • వ్యాపార సంస్థలు అద్దెకు ఇచ్చే నివాస సముదాయాలకు పన్ను మినహాయింపును తొలగించడానికి మొగ్గుచూపాయి.
  • రిస్కు అధికంగా ఉన్న పన్ను చెల్లింపుదారుల ఆర్థిక స్థితిగతులను అంచనావేసేందుకు మరిన్ని వెరిఫికేషన్ ప్రక్రియలు చేపట్టాలని మంత్రుల బృందం కోరింది.

మరోవైపు, బుధవారం సైతం మండలి భేటీ కొనసాగనుంది. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం 2022 జూన్ తర్వాత కూడా చెల్లించాలనే ప్రతిపాదనపై బుధవారం చర్చ జరగనుంది. క్యాసినోలు, ఆన్​లైన్ గేమింగ్, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధించాలన్న అంశంపైనా బుధవారం మండలి చర్చించనుంది.

ఇదిలా ఉండగా..జీఎస్టీ వసూళ్లను పంచేందుకు వాడుతున్న సూత్రాన్ని మార్చాలని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. లేదంటే పరిహారాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కోరుతున్నాయి. బుధవారం ఈ అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రాలు భారీగా ఆదాయం కోల్పోనున్నాయనే అనుమానాల నేపథ్యంలో ఈ డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2017 జులై 1న జీఎస్టీ అమలులోకి రాగా.. రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయానికి 2022 జూన్ వరకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ప్రస్తుతం జీఎస్టీ రెవెన్యూను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం పంచుకుంటున్నాయి. లగ్జరీ, సిన్(సిగరెట్లు, ఆల్కహాల్ వంటివి) వస్తువుల నుంచి వచ్చే సెస్సును రాష్ట్రాలకు పరిహారం ఇచ్చేందుకు కేంద్రం వినియోగిస్తోంది.

రాష్ట్రాల ప్రొటెక్టెడ్ రెవెన్యూలో 14 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. సెస్సులు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు. కరోనా తర్వాత ఈ రెండిటి మధ్య తేడా మరింత పెరిగింది. 2021-22లో ఆరు రాష్ట్రాల రెవెన్యూ మాత్రమే.. ప్రొటెక్టెడ్ రెవెన్యూ రేటుతో పోలిస్తే అధిక వృద్ధి నమోదు చేసింది. పుదుచ్చేరి, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్​ల ఆదాయ అంతరం చాలా ఎక్కువగా ఉంది.

ఈ నేపథ్యంలో, పలు రాష్ట్రాలు తాము ఆదాయం కోల్పోతున్నామని కేంద్రంతో మొరపెట్టుకుంటున్నాయి. జీఎస్టీ వల్ల గనులు, తయారీ రంగంపై ఆధారపడ్డ రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంటూ ఛత్తీస్​గఢ్ ఆర్థిక మంత్రి టీఎస్ సింగ్ డియో.. నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పంచే ఆదాయాన్ని 70-80శాతానికి పెంచాలని పేర్కొన్నారు.

మరోవైపు, ఆర్థిక మండలిలో అధికార పక్షానికి మెజారిటీ ఉన్నప్పటికీ.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య సలహాదారుడు అమిత్ మిత్ర పేర్కొన్నారు. ఈ మేరకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. 'మెజారిటీవాదాన్ని పక్కనబెట్టి జీఎస్టీ మండలి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ప్రతి నిర్ణయాన్ని.. సయోధ్యతోనే తీసుకోవాలి' అని అన్నారు. జీఎస్టీ మండలి ప్రతిపాదనలను తప్పక పాటించాలనే నిబంధన లేదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. పార్లమెంట్​, రాష్ట్రాల శాసనసభలు సైతం జీఎస్టీపై చట్టాలు చేసే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details