GST collections: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూన్‌లో రూ. 1.44 లక్షల కోట్లుగా నమోదైనట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ ఆదాయం గతేడాది ఇదే నెల కంటే 56 శాతం పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుత రోజుల్లో ఇంత మొత్తం రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇదే ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు పతనమవుతున్న నేపథ్యంలో ఈ అంశంపైనా స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఈ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. దిగుమతులపై రూపాయి విలువ ప్రభావాన్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు వివరించారు.
విదేశాలకు ఎగుమతి చేస్తున్న పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం.. ఎగుమతి పన్ను విధించింది. ఈ నేపథ్యంలో స్పందించిన నిర్మల.. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ముడి చమురు, డీజిల్, విమాన ఇంధనంపై విధించే కొత్త పన్నులను ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఓసారి సమీక్షిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కఠిన సమయం నడుస్తుందని.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు హద్దుల్లేకుండా పెరుగుతున్నాయని అన్నారు.