GST collection April 2022: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ చూడనంతగా వసూళ్లు వచ్చాయి. 2022 ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వస్తు, సేవల పన్ను వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42లక్షల కోట్లు.. రెండో అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. మార్చితో పోలిస్తే ఏప్రిల్లో.. రూ.25 వేలు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని వివరించింది. 2021 ఏప్రిల్లో వచ్చిన జీఎస్టీతో పోలిస్తే ఇది 20 శాతం అధికమని స్పష్టం చేసింది.
ఏప్రిల్లో వసూలైన రూ.1,67,540 కోట్లలో.. సీజీఎస్టీ రూపంలో రూ.33,159 కోట్లు, ఎస్జీఎస్టీ రూపంలో రూ.41,793 కోట్లు వసూలయ్యాయి. సమీకృత జీఎస్టీ కింద రూ.81,939 కోట్లు వచ్చాయి. సెస్ రూపంలో రూ.10,649 కోట్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. ట్యాక్స్ చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులు సమర్పించేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలించాయని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పేర్కొంది. జీఎస్టీ చెల్లింపులు సులభంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్ ద్వారా పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేసింది.