Export Tax On Petrol Diesel: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్ను పెంచింది. అలాగే అదనపు విండ్‌ఫాల్ ట్యాక్స్ విధించింది. డొమెస్టిక్ రిఫైనరీస్ అర్జించే లాభాలపై ఈ పన్ను పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏటీఎఫ్, పెట్రోల్‌పై ఎగుమతి ట్యాక్స్‌ను లీటరుకు రూ. 6 మేర పెంచింది. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 13 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా దేశీయంగా ఉత్పత్తి చేసిన క్రూడాయిల్‌పై టన్నుకు అదనంగా రూ.23,230 ట్యాక్స్ విధించింది. అయితే ఎక్స్‌పోర్ట్ ఫోకస్డ్ రిఫైనరీస్‌కు మాత్రం ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు లభించింది. అలాగే ఎగుమతిదారులు కచ్చితంగా వారి డీజిల్ ఉత్పత్తిలో 30 శాతాన్ని దేశీయంగా విక్రయించాలనే నిబంధనను తీసుకువచ్చింది కేంద్రం.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర భారీగా పడిపోయింది. ఏకంగా 4 శాతానికి పైగా కుప్పకూలింది. 2020 నవంబర్ 2 నుంచి చూస్తే షేర్ ధర ఇంట్రాడేలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. విండ్‌ఫాల్ ట్యాక్స్ ప్రకటనే ఇందుకు ప్రధాన కారణం. ఓఎన్‌జీసీ కూడా ఇదే దారిలో నడుస్తోంది.
ఈ పన్ను పెంపు నిర్ణయంతో సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. బంగారంపై ప్రాథమిక దిగుమతి పన్నును కేంద్ర ప్రభుత్వం.. 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. రూపాయి జీవితకాల కనిష్ఠ స్థాయికి పడిపోవడం వల్ల దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ తర్వాత బంగారం డిమాండ్ పెరగడం వల్ల. .భారత్ 10 ఏళ్లలో దిగుమతి చేసుకున్న దానికంటే గత ఏడాదిలోనే అత్యధికంగా దిగుమతి చేసుకుంది.