semiconductors in India: 2023-24 కల్లా దేశీయంగా తయారైన తొలి చిప్ సెట్‌ల (సెమీ కండక్టర్లు) వాణిజ్య విక్రయాలు ప్రారంభం అయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. బుధవారం శ్రీకారం చుట్టిన డిజిటల్ ఇండియా ఆర్‌ఐఎస్‌సీ- వి (డీఐఆర్-వి) కార్యక్రమం కింద దీనిని చేపట్టనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
దేశంలో మొబిలిటీ, కంప్యూటింగ్, డిజిటలీకరణ అవసరాలను తీర్చేందుకు కావాల్సిన భవిష్యతరం మైక్రోప్రాసెసర్లను తయారు చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 2023 డిసెంబరు కల్లా లేదంటే 2024 ప్రారంభంలో శక్తి, వేగా సిలికాన్ ప్రాసెసర్లను అందుబాటులోకి తేవాలనే ఓ కీలక లక్ష్యంపై దృష్టి పెట్టామని ఆయన అన్నారు. 2023-24 లోగా కనీసం కొన్ని కంపెనీలైనా వాటి ప్రోడక్ట్ డిజైన్‌లకు డీఐఆర్ ఉత్పత్తులైన శక్తి, వేగాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి చెప్పారు. సిలికాన్ సిద్ధమైతే.. అవి తయారీ ప్రారంభించి, ఉత్పత్తుల్లో చిప్‌లను అమరుస్తాయని విలేకరులకు చంద్రశేఖర్ చెప్పారు.