Govt Bank FD Interest Rates 2023 : మీరు స్థిరమైన ఆదాయం ఇచ్చే మంచి పెట్టుబడి మార్గం కోసం చూస్తున్నారా? అయితే మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) సరైన ఎంపిక అవుతాయి. ఎఫ్‌డీలను సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూడవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం లేదా ఆర్బీఐ నియంత్రిత బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తుండటమే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా అందిస్తుంది. దీని వల్ల మీరు డబ్బు నష్టపోయే అవకాశాలు బాగా తక్కువ అవుతాయి.
మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్లో పెట్టుబడి పెడితే, మొదట్లోనే వడ్డీ రేటు నిర్ణయిస్తారు. కనుక గ్యారెంటీ రిటర్న్స్‌కి హామీ ఉంటుంది. ఎందుకంటే ఎఫ్‌డీ రేట్లు మార్కెట్ పనితీరుతో ముడిపడి ఉండవు. సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్.. మార్కెట్ ఒడుదొడుకుల ప్రభావానికి గురవుతాయి. కానీ ఎఫ్డీలపై ఈ ప్రభావం ఉండదు కనుక వీటి నుంచి స్థిరమైన రాబడి వస్తుంది. అందువల్ల రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంచుకోవడం మంచిది.
బ్యాంకు వడ్డీ రేట్లు
ఫిక్స్‌డ్ డిపాజిట్స్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. అవి నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి లేదా ఒకేసారి ఎఫ్‌డీ మెచ్యూర్ అయిన తర్వాత మీ అకౌంట్లో జమ అవుతాయి. మీ ఆర్థిక అవసరాలను అనుసరించి ఈ పేఅవుట్ పీరియడ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఒక మెచ్యూరిటీ కాలం లేదా నిర్ణీత కాలం ఉంటుంది. అయితే అవి కొంత వరకూ లిక్విడిటీని అందిస్తాయి. కొన్ని ఎఫ్‌డీలు ముందస్తు ఉపసంహరణలను అనుమతించినప్పటికీ, దానికి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది లేదా తక్కువ వడ్డీ రేటుకే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.