తెలంగాణ

telangana

ETV Bharat / business

త్వరలో ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్​ఫాం.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​​కు గట్టి పోటీ! - business news today

రిటైల్‌ విపణి కోసం మరో ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ వస్తోంది. ఇది ప్రభుత్వ రంగ, లాభాపేక్షలేని వ్యవస్థ కావడం విశేషం. దిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్‌ నగరాల్లో ఈ నెట్‌వర్క్‌ పైలట్‌ ప్రాజెక్టును వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.

government-e-commerce-platform
త్వరలో ప్రభుత్వ ఈ-కామర్స్ ప్లాట్​ఫాం.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​​కు గట్టి పోటీ!

By

Published : Apr 29, 2022, 7:22 AM IST

E commerce platform: దేశీయంగా రూ.75 లక్షల కోట్ల స్థాయిలో ఉండి, శరవేగంగా వృద్ధి చెందుతున్న రిటైల్‌ విపణి కోసం మరో ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ వస్తోంది. ఇది ప్రభుత్వ రంగ, లాభాపేక్షలేని వ్యవస్థ కావడం విశేషం. దేశంలో ఆధార్, యూపీఐ వ్యవస్థలను తీసుకురావడంలో ప్రభుత్వానికి సహాయం చేసిన నందన్‌ నీలేకనితో పాటు పలువురు ప్రముఖులు ‘ఓపెన్‌ టెక్నాలజీ నెట్‌వర్క్‌’ ఆధారిత ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ రూపకల్పనలోనూ ప్రభుత్వానికి సాయం చేస్తున్నారు. దిల్లీ, బెంగళూరు, భోపాల్, షిల్లాంగ్, కోయంబత్తూర్‌ నగరాల్లో ఈ నెట్‌వర్క్‌ పైలట్‌ ప్రాజెక్టును వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఎంపిక చేసిన వినియోగదార్లతో పరీక్షించనున్నారు. తదుపరి 100 నగరాలకు విస్తరించాలన్నది ప్రతిపాదన.

ఇదీ లక్ష్యం:దేశీయ ఇ-కామర్స్‌ విపణిలో 80 శాతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ చేతిలోనే ఉందని అంచనా. 2400 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.80 లక్షల కోట్ల) పెట్టుబడుల ద్వారా, వివిధ ఉత్పత్తులపై భారీ రాయితీలతో పాటు ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ సంస్థలు వినియోగదార్లను ఆకర్షించాయి. కొవిడ్‌ పరిణామాలతో నిత్యావసరాల కోసం కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇవ్వడం పెరిగింది. దీంతో కిరణా షాపుల భవిత అనిశ్చితిలో పడుతోందని అంచనా. మొత్తం రిటైల్‌ విపణిలో ఆన్‌లైన్‌ అమ్మకాల విలువ ప్రస్తుతానికి 6 శాతమే ఉన్నా.. భవిష్యత్తులో ఈ విభాగం గణనీయంగా పెరుగుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఎటువంటి అవరోధాలు లేకుండా, చిన్న దుకాణాదారులు కూడా ఆన్‌లైన్‌లో విక్రయాలు జరుపుకునే వేదిక రూపొందించాలన్న’ ప్రధాని మోదీ సూచనతో నీలేకని, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మతో సహా 9 మంది సభ్యుల సలహా సంఘం రంగంలోకి దిగింది. ‘ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌’ (ఓఎన్‌డీసీ) పేరిట లాభాపేక్షలేని ప్లాట్‌ఫాంనకు రూపకల్పన చేశారు. డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ ఎంతగా సంచలనం సృష్టిస్తుందో, ఈ ప్లాట్‌ఫామ్‌ కూడా అదేవిధంగా విజయవంతం అయ్యేలా చూడాలన్నదే నీలేకని యత్నమని చెబుతున్నారు. అత్యంత ఆకర్షణీయ ధరలు, సరకు నిర్వహణలో సమర్థత, సరఫరా వ్యయాలను అదుపులో ఉంచుకోవడంపై ఆధారపడి ఈ వ్యవస్థ రాణిస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు ఓఎన్‌డీసీతో ఒప్పందం చేసుకున్నాయి.

ఎలా పనిచేస్తుంది?:ప్రభుత్వ ఆధ్వర్యంలో, లాభాపేక్ష రహితంగా పనిచేసే ఈ ప్లాట్‌ఫాంను ట్రేడర్లు, వినియోగదార్లు వినియోగించుకోవచ్చు. సబ్బు నుంచి విమాన టికెట్ల వరకు ఏదైనా విక్రయించుకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు. ‘డిజిటల్‌ కామర్స్‌ వంటి కొత్త, అధిక వృద్ధి రంగంలో పాల్గొనడానికి లక్షల కొద్దీ చిన్న విక్రేతలకు ఒక సులువైన మార్గాన్ని ఇవ్వనున్నామ’ని ఇటీవల నీలేకని బెంగళూరులో పేర్కొన్నారు. ఈ నమూనాను అర్థం చేసుకోవాల్సి ఉందని.. ఆ తర్వాతే ఏం చేయాలన్నది నిర్ణయిస్తామని అమెజాన్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌ విజయవంతమైతే చిన్న వ్యాపారులు సైతం ఆన్‌లైన్‌ వ్యాపారం ద్వారా ఎందరికో తమ ఉత్పత్తులను విక్రయించగలుగుతారు. దేశంలో 80 కోట్ల మందికి పైగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఉండటం కలిసొచ్చే అంశం.

దిగ్గజ ఇకామర్స్‌ సంస్థలకు దీటుగా ఈ ప్లాట్‌ఫామ్‌ ఉండాలంటే.. వినియోగ అనుభవం, చెల్లింపులు, ఉత్పత్తులు నచ్చకపోతే తిరిగి ఇచ్చే వెసులుబాటు, వారికి నగదు వాపసు వంటి వ్యవస్థలన్నీ మెరుగ్గా రాణించాలి.

ఇదీ చదవండి:ట్విట్టర్ డీల్​తో మస్క్ జాక్​పాట్​.. ఇక కాసుల వర్షమే!

ABOUT THE AUTHOR

...view details