Goutam Adani Investments: దేశంలో పెట్టుబడులు కొనసాగించే విషయంలో మందకొడిగా కానీ.. లేదంటే నిలిపివేయడం కానీ జరగదని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. దేశ వృద్ధితోనే గ్రూప్ విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. నౌకాశ్రయాల నుంచి విద్యుత్ కంపెనీల వరకు ఉన్న ఈ గ్రూప్ కంపెనీల వార్షిక వాటాదార్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 'కొత్త ఇంధన వ్యాపారంపై 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులను గతంలోనే ప్రకటించాం. ఇవి భారత్‌ను చమురు-గ్యాస్ దిగుమతిదారు నుంచి హరిత ఇంధన ఎగుమతిదారుగా మారుస్తాయి. భారత్‌లో పెట్టుబడులను నెమ్మదింపజేసే ఆలోచన లేదు. వేర్వేరు వ్యాపారాల పనితీరు వల్లే అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల్లోనూ బలంగా రాణిస్తున్నామని విశ్వసిస్తున్నాను. భారత్ వృద్ధిలోనే అదానీ గ్రూప్ విజయమూ ఆధారపడి ఉంటుంద'ని అన్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా 2030 కల్లా 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాదికి 2 గిగావాట్ల సోలార్ తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి 20 బి. డాలర్ల పెట్టుబడులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెట్టనుంది. మిగతా మొత్తాన్ని హరిత హైడ్రోజన్ తయారీకి వినియోగించనుంది.
భారత్ వెలుపలా విస్తరిస్తాం..
'భవిష్యత్ ఇంధనంగా హరిత హైడ్రోజన్‌ను మార్చడానికి పునరుత్పాదక రంగంలో మా బలం ఉపయోగపడుతుంద'ని అదానీ తెలిపారు 'అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వందల కోట్ల డాలర్లను సేకరించే సత్తా మనకు ఉంది. మా వృద్ధి, విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. పలు విదేశీ ప్రభుత్వాలు తమ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణాలకు సహాయం చేయమని కోరాయి. అందువల్లే విదేశాల్లోనూ విస్తరణ కోసం పునాది వేస్తున్నామ'న్నారు. 'పెరుగుతున్న మార్కెట్ విలువ వల్ల మా నగదు ప్రవాహం అధికమై, సామర్థ్య విస్తరణపైన దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతోంది. మా ఎబిటాలో 26 శాతం వృద్ధి నమోదైంది. పోర్ట్‌ఫోలియో ఎబిటా రూ.42,623 కోట్లకు చేరుకుంద'ని వివరించారు. 'అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కున్న విశిష్ట వ్యాపార నమూనా ఏ ఇతర కంపెనీకీ లేదు. వచ్చే పలు దశాబ్దాల పాటు అపరిమిత బీ2బీ, బీ2సీ మార్కెట్‌ను అందుకోగల సత్తా ఉంద'ని అదానీ వెల్లడించారు.