Google Pay Services Expansion To Other Countries : భారత్‌లో విశేష జనాదరణ పొందిన ప్రముఖ ఆన్లైన్ చెల్లింపు సేవల సంస్థ గూగుల్ పే తన సేవలను విదేశాల్లోనూ విస్తరించేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు(ఎన్పీసీఐ) చెందిన ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ వెలుపలా యూపీఐ సేవల్ని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సౌలభ్యంతో ఇతర దేశాల్లోను సులువుగా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చని చెప్పింది. ఇక ఈ తాజా నిర్ణయంతో విదేశాలకు వెళ్లే వారికి నగదు తీసుకెళ్లటం, ఇంటర్నేషనల్ గేట్‌వే ఛార్జీల భారం తగ్గనుంది.
గూగుల్-ఎన్పీసీఐ మధ్య కుదిరిన ఒప్పందంలోని మూడు కీలకాంశాలు ఇవే
- ఎలాంటి ఇబ్బందీ లేకుండా భారత్ వెలుపలా సులువుగా లావాదేవీలు నిర్వహించటం.
- ఇతర దేశాల్లో యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయడంలో సాయపడటం.
- మూడోది వివిధ దేశాల మధ్య చెల్లింపుల ప్రక్రియ సులభతరం చేయడం.
"డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఇకపై విదేశీ కరెన్సీ, ఫారెక్స్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గూగుల్‌పే ద్వారా భారత్ వెలుపలా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఈ అవగాహన ఒప్పందం యూపీఐ ఉనికిని మరింత పటిష్ఠం చేస్తుందనే నమ్మకం మాకుంది."
- రితేశ్ శుక్లా, ఎన్‌పీసీఎల్ సీఈఓ