Google Pay Sachet Loan : చిరువ్యాపారులకు గుడ్ న్యూస్. గూగుల్ ఇండియా చిరువ్యాపారులకు రూ.15,000 వరకు సాచెట్ లోన్స్ అందిస్తోంది. గూగుల్ పే (Gpay) యాప్ ద్వారా సులువుగా ఈ స్మాల్ బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా.. డీఎంఐ ఫైనాన్స్‌తో కలిసి ఈ రుణాలను ఇస్తోంది.
నెలకు రూ.111 మాత్రమే!
చిరువ్యాపారులు గూగుల్ పే ద్వారా సులువుగా రూ.15,000 వరకు రుణం తీసుకోవచ్చు. వాస్తవానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఇలాంటి చిన్న మొత్తాలను రుణాలుగా తీసుకుంటే.. చాలా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ గూగుల్ పేలో తీసుకున్న రుణాలకు.. నెలకు రూ.111 చొప్పున ఈఎంఐ చెల్లించుకునే వెసులుబాటు ఉంది.
క్రెడిట్ లైన్స్!
వ్యాపారం చేయాలంటే కచ్చితంగా కొంత పెట్టుబడి (వర్కింగ్ క్యాపిటల్) ఉండాలి. బ్యాంకులు అంత సులువుగా ఈ రుణాలు మంజూరు చేయవు. ప్రైవేట్‌గా రుణాలు తీసుకుంటే వడ్డీలు అధికంగా ఉంటాయి. అందుకే గూగుల్ పే.. ePayLater భాగస్వామ్యంతో.. వ్యాపారులకు క్రెడిట్ లైన్స్‌ను అందిస్తామని ప్రకటించింది. గూగుల్ పే అందించే ఈ క్రెడిట్ లైన్స్‌తో.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగానూ వ్యాపారులు తమకు కావల్సిన సామగ్రిని, స్టాక్లను కొనుగోలు చేయవచ్చు.
పర్సనల్ లోన్స్ కూడా!
గూగుల్ ఇండియా.. ఐసీఐసీఐ బ్యాంక్ సహకారంతో.. యూపీఐపై కూడా క్రెడిట్ లైన్స్‌ను అందిస్తోంది. అంతేకాదు. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో వ్యక్తిగత రుణాలను కూడా మంజూరు చేస్తోంది. అందువల్ల.. వ్యక్తులు తమ గూగుల్ పే యాప్ ఉపయోగించి పర్సనల్ లోన్ కూడా పొందడానికి అవకాశం ఏర్పడింది.