ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది ప్రముఖ సెర్చింజిన్ సంస్థ గూగుల్. ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఇలా చేస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. ఉద్వాసనకు గురవుతున్న ఉద్యోగులందరికీ ఇప్పటికే మెయిల్స్ చేసినట్లు.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ వెబ్సైట్ ద్వారా వెల్లడించారు. గత కొన్నేళ్లుగా భారీగా నియామకాలు చేపట్టినా సరే.. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గూగుల్, ఆల్ఫాబెట్లోని పలు విభాగాల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.
'ఖర్చులను తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపరుచుకోవడం, మూలధనం వృద్ధి వంటి విషయాలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది' అని సుందర్ పిచాయ్ అన్నారు. దీంతో పాటుగా తొలిగించిన ఉద్యోగులను క్షమాపణలు కోరారు. ఈ కఠిన నిర్ణయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
"గూగుల్ కఠిన నిర్ణయం తీసుకుంది. మేము మా ఉద్యోగుల్లో సుమారుగా 12,000 మందిని తొలగించనున్నాము. రిక్రూటింగ్, కార్పొరేట్ ఫంక్షన్స్, కొన్ని ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ బృందాల్లో ఈ ఉద్యోగ కోతలు ఉంటాయి. ఈ ప్రభావం కంపెనీ పనితీరుపై పడుతుంది. మేము ఇప్పటికే అమెరికాలో తొలగిస్తున్న ఉద్యోగులకు వ్యక్తిగతంగా మెయిల్స్ పంపించాము. ఇతర దేశాల్లో స్థానిక చట్టాల కారణంగా ఈ తొలగింపుల ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఈ కఠిన నిర్ణయానికి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నాను. ఈ కోతలు ఉద్యోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉద్యోగులను నేను క్షమాపణలు కోరుతున్నాను" అని అన్నారు సుందర్.