తెలంగాణ

telangana

ETV Bharat / business

'AIని తల్చుకుంటే నిద్ర పట్టట్లేదు.. ఆ సమాధానాలు ఎలా వస్తున్నాయో తెలీదు!' - ai good or bad debate

కృత్రిమ మేధ దుష్ప్రభావాలను తలచుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. ఏఐని సరైన విధంగా ఉపయోగించకుంటే తీవ్రమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వీటిపై నియంత్రణకు చట్టాలు చేయాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.

google-ceo-sundar-pichai-on-artificial-intelligence
google-ceo-sundar-pichai-on-artificial-intelligence

By

Published : Apr 18, 2023, 10:16 AM IST

కృత్రిమ మేధను సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ హెచ్చరించారు. అటువంటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉంచాలని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ దుష్ప్రభావాలను తలచుకొని.. నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని పిచాయ్‌ అన్నారు. ఏఐతో అసత్య సమాచారాన్నీ రూపొందించే వీలుందని.. వాటివల్లే జరిగే అనర్థాలకు మన దగ్గర సమాధానాలు లేవని ఓ ఇంటర్వ్యూలో పిచాయ్ పేర్కొన్నారు.

కృత్రిమ మేధను ప్రయోజనకర మార్గంలో వినియోగించడంపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఏఐని సురక్షితంగా ఉంచడం అనేది ఏదో ఒక కంపెనీ నిర్ణయించకూడదని పిచాయ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచదేశాలన్నీ కలిసి వీటిపై ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. సమాజంలో దీని కోసం చట్టాలు రావాలని అన్నారు. అణ్వాయుధాల కార్యాచరణ మాదిరిగానే ఇది కూడా ఉండాలని సూచించారు.

"సురక్షిత ఏఐ కోసం ఇంజినీర్లు ఉంటే సరిపోదు. సోషల్ సైంటిస్టులు, తత్వవేత్తలు కూడా ఇందులో భాగం కావాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా సామాజిక వ్యవస్థలు లేవని నా అభిప్రాయం. వెంటనే దీనిపై సమాజం నియంత్రణ చర్యలు చేపట్టాలి. వీటిని దుర్వినియోగం చేసే వారిని శిక్షించేలా చట్టాలు తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఏఐని సురక్షితంగా ఉంచేందుకు దేశాల మధ్య ఒప్పందాలు కుదరాలి. మానవ విలువలు, నైతికతకు అనుగుణంగా ఏఐల అభివృద్ధి సాగేలా నిబంధనలు తీసుకురావాలి."
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ

సాంకేతికతలో వేగంగా మార్పులు వస్తున్నాయని.. కొత్త సాంకేతికతను తీసుకువచ్చేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయని పిచాయ్ తెలిపారు. ఏఐ వల్ల సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. "ఓ సమాజంగా మనం వీటికి అలవాటుపడాలి. ఏఐ ద్వారా ప్రభావం ఎదుర్కొనే ఉద్యోగుల్లో అకౌంటెంట్లు, రైటర్లు, ఆర్కిటెక్ట్​లు అధికంగా ఉండొచ్చు. ఆశ్చర్యం ఏంటంటే సాఫ్ట్​వేర్ ఉద్యోగులు కూడా ఇందులో ఉంటారు. ప్రతి కంపెనీ, ప్రతి ప్రొడక్ట్​పై ఈ ప్రభావం ఉంటుంది" అని పిచాయ్ అంచనా వేశారు.

'పూర్తిగా తెలియదు'
చాట్​బాట్​ల గురించి పూర్తిగా తెలియదని, అవి కొన్ని సమాధానాలను ఎలా చెప్పగలుగుతుందో అర్థం చేసుకోలేమని పిచాయ్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు బార్డ్ (గూగుల్ ఏఐ చాట్​బాట్) వంటి సాంకేతికతలను ఎందుకు విడుదల చేశారని హోస్ట్ అడగ్గా.. మనిషి మెదడు గురించి కూడా మనకు పూర్తిగా తెలియదంటూ సమాధానం ఇచ్చారు పిచాయ్. ఇతర సాంకేతికతలు వచ్చిన సమయంలోనూ అనేక ఆందోళనలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏఐ విషయంలో తాము సానుకూలంగానే ఉన్నట్లు చెప్పారు.

లిబరల్ చాట్​జీపీటీ!
మరోవైపు, బిలియనీర్ ఎలాన్ మస్క్ సైతం ఏఐపై హెచ్చరిక స్వరం వినిపించారు. చాట్​జీపీటీ ఉదారవాదుల (లిబరల్స్)కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ట్రూత్​జీపీటీ అనే కొత్త ఏఐ చాట్​బాట్​ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ట్రూత్​జీపీటీ పూర్తిగా నిజాల గురించి చెప్పే ఏఐ అని.. విశ్వం అసలైన స్వభావాన్ని దాని ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details