Casino Online Gaming GST: క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్ గేమింగ్‌పై ఎంత జీఎస్‌టీ విధించాలన్న అంశంపై మంత్రుల కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. వీటిపై 28 శాతం జీఎస్‌టీ వేయాలని పేర్కొంటూ తుది నివేదికను రూపొందించింది. త్వరలో జరగబోయే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
దేశంలోని క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్‌లైన్ గేమింగ్‌లపై జీఎస్‌టీకి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ ఓ మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఈ కమిటీ ఈ నెల మొదటి వారంలో సమావేశమైంది. క్యాసినోలు, రేస్‌కోర్సులు, ఆన్‌లైన్ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్‌టీ విధించాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. తాజాగా మంత్రుల కమిటీ మరోసారి సమావేశమై దీనిపై తుది నివేదికను రూపొందించింది. "క్యాసినోలు, రేస్ కోర్సులు, ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్‌టీ విషయంలో మంత్రుల కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇందుకు సంబంధించిన రిపోర్ట్‌ను ఒకట్రెండు రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేస్తాం" అని సంగ్మా ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ నెలాఖరులో జరిగే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు.