Gold Rate Forecast : బంగారం విలువ రోజురోజుకూ తగ్గిపోతోంది. అమెరికన్ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలతో పాటు, డాలర్ విలువ పెరుగుతుండడం కూడా పసిడి ధరలు గత వారం భారీగా తగ్గడానికి కారణం. వాస్తవానికి బంగారం ధరలు మూడు నెలల కనిష్ఠ విలువకు పడిపోయాయి. ఎందుకంటే ఇప్పటికీ ఇన్వెస్టర్లు అమెరికన్ డాలర్‌ను ఒక మంచి ఆసెట్గా భావిస్తూ ఉండడమే. 2023 ఆగస్టు గోల్డ్ ఫీచర్ కాంట్రాక్ట్ గడువులో.. 10 గ్రాముల బంగారం ధర రూ.58,300 వద్ద ముగిసింది. అయితే ఎమ్‌సీఎక్స్‌లో కిలో వెండి ధర రూ.68,085గా ఉంది.
పసిడి ధరలు తగ్గడానికి కారణం ఏమిటి?
Gold Price Falls Down Reasons : పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు బాగా పెంచింది. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ కూడా ఒక వారం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీని వల్ల మదుపర్లకు బంగారంపై ఆసక్తి తగ్గింది. అలాగే నార్వే, స్విట్జర్లాండ్, టర్కీలకు చెందిన కేంద్ర బ్యాంకులు రుణాలపై వడ్డీలను పెంచాయి. అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ కూడా ఈ సంవత్సరం ముగిసేలోపు మరో రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇవన్నీ కూడా పసిడి విలువలు క్షీణించడానికి కారణం అయ్యాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వడ్డీ రేట్లు పెరిగితే..
Gold price Vs Fed Rate : ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మద్దతు ధర కంటే కిందకు పడిపోయాయి. కీలక మద్దతు స్థాయిలు.. ఔన్స్ బంగారం ధర సుమారుగా 1,935 డాలర్లు, 10 గ్రాముల బంగారం ధర రూ.59,200 కంటే పసిడి ధరలు కిందకు పడిపోయాయి. కానీ తరువాత కొంత వరకు పసిడి ధరలు రికవర్ అయ్యాయి. దీనికి కారణం అమెరికా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు ఉండడం. అలాగే యూఎస్‌లోని ప్రైవేట్ సెక్టార్ కంపెనీల ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉండకపోవడం వల్ల కొంత వరకు బంగారం వంటి సురక్షిత ఆస్తులకు డిమాండ్ పెరిగింది. కానీ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపు, యూఎస్ కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
పసిడి విలువ మరింత తగ్గే అవకాశం
సమీప భవిష్యత్‌లో బంగారం, వెండి ధరలపై మరింత ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలన్నీ కఠినమైన ద్రవ్య విధానాన్ని అనుసరించడానికే మొగ్గు చూపుతున్న వేళ.. బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.