తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారానికి రెక్కలు.. ఇప్పుడు కొనొచ్చా? ధర పెరుగుతుందా? తగ్గుతుందా? - బంగారం ధర పెరగడానికి కారణం

అంతర్జాతీయ పరిణామాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభ పరిస్థితుల వల్ల బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మరి ఈ సమయంలో పసిడి కొనొచ్చా? వచ్చే కొద్దిరోజుల్లో బంగారం ధర పెరుగుతుందా? తగ్గుతుందా? నిపుణులు ఏమంటున్నారు?

will gold rise furhter
will gold rise furhter

By

Published : Mar 21, 2023, 3:48 PM IST

అమెరికా, ఐరోపాలో బ్యాంకింగ్ సంక్షోభంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. పెట్టుబడులకు సురక్షిత గమ్యాన్ని వెతుక్కుంటున్న ఇన్వెస్టర్లు.. బంగారంపై డబ్బు కుమ్మరిస్తున్నారు. దీంతో పసిడి ధర అమాంతం పెరిగిపోతోంది. సోమవారం రూ.60వేల మార్క్​ను తాకింది. చివరకు రూ.59,700 వద్ద ట్రేడింగ్ ముగించింది. ముంబయి​లోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్​లో బంగారం ధర రూ.60వేలకు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

పది రోజుల క్రితం రూ.55,200 వద్ద ట్రేడ్ అయిన బంగారం ధర.. స్వల్ప కాలంలోనే ఎనిమిది శాతానికి పైగా పెరిగింది. ఈ కాలంలోనే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ స్విస్ బ్యాంకుల సంక్షోభం మార్కెట్​లో సంచలనం సృష్టించింది. ఫలితంగా పసిడి ధర పైపైకి చేరిపోయింది. అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభానికి తోడు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్​బీఐ వంటి సంస్థలు వడ్డీ రేట్లు పెంచడం బంగారం ధర పెరగడానికి కారణమవుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనం కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు.

"బ్యాంకింగ్ సంక్షోభం బంగారం ధరలను ప్రభావితం చేస్తోంది. బ్యాంకుల వద్ద నిల్వలు తగ్గిపోతుండటం సమస్యగా మారింది. దీంతో సురక్షిత పెట్టుబడి అయిన బంగారానికి విలువ పెరుగుతోంది. బంగారం రూ.60వేలకు చేరడం ఆశ్చర్యకరమైన పరిణామం కాదు. డాలర్​తో పోలిస్తే స్థానిక కరెన్సీ 82.45 పలుకుతోంది. కమెక్స్​ (కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో ఔన్సు బంగారం 1980 డాలర్లు ఉంది." అని నిపుణులు చెబుతున్నారు.

"అమెరికా ఫెడరల్ రిజర్వ్ వరుసగా వడ్డీ రేట్లు పెంచుతూ వస్తోంది. దీనివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమాంద్యంలోకి కూరుకుపోతుందనే ఆందోళన ఉంది. త్వరలో మరో ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచకుండా ఉంటే.. డాలర్​పై నియంత్రణ పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని రేట్లు పెంచితే.. పెట్టుబడిదారులు బంగారాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఫెడ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. బంగారానికి ప్రయోజనకరమే." అని రిద్ధిసిద్ధి బులియన్స్​ ఎండీ పృథ్వీ రాజ్​ ఓ ఆంగ్ల వార్తా సంస్థతో చెప్పారు.

శనివారం ఫెడ్ మీటింగ్ జరగనుంది. ఆలోపు బంగారం ధర మరింత పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫెడ్ మెతక వైఖరి అనుసరించి.. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం లేదా తగ్గించడం వంటివి చేస్తే బంగారం ధర భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నాయి. వడ్డీ రేట్ల విషయంలో దూకుడు కొనసాగిస్తే మాత్రం.. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

"మార్కెట్ల దృష్టంతా ఎఫ్ఓఎంసీ (ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ) మీటింగ్​పైనే ఉంది. వడ్డీ రేట్లపై వారి వైఖరి ఏంటన్న విషయంపైనే బంగారం ధర భవిష్యత్ ఆధారపడి ఉంది. కొద్దిరోజుల వరకు బంగారం ధర అస్థిరంగానే ఉంటుంది. ధర రూ.58వేల లోపునకు పడిపోతే తప్ప.. ట్రెండ్ మాత్రం పాజిటివ్​గానే ఉంటుంది. రూ.60,500 వరకు ర్యాలీ ఉండొచ్చు. ఔన్సుకు 2వేల డాలర్లు, పది గ్రాములకు రూ.60,800 వద్ద సైకలాజికల్ బ్యారియర్ ఉండొచ్చు. రూ.59,750 వద్ద మద్దతు లభిస్తుంది." అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం ఎదురైతే పెట్టుబడిదారులు వెంటనే ఎంచుకునే మార్గం బంగారం. ఆర్థిక, బ్యాంకింగ్ వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయినప్పుడు.. ఇన్వెస్టర్లు పసిడినే ఆశ్రయిస్తుంటారు. ఇతర ఆస్తుల మాదిరిగా బంగారం తన విలువ కోల్పోదు. అందరికీ తెలిసిన విలువైన వస్తువు కావడం దీనికి ఉన్న మరో ప్రత్యేకత. అందుకే దీన్ని కొనేందుకు మొగ్గుచూపుతుంటారు.

ABOUT THE AUTHOR

...view details