పండగల వేళ బంగారం కొనాలనుకునే వారికి నిజంగా ఇది చేదు వార్త అనే చెప్పాలి. భారత్‌కు చేసే బంగారం సరఫరాలో విదేశీ బ్యాంకులు కోత విధించినట్లు సమాచారం. వారు చైనా, తుర్కియే విపణిపై దృష్టి సారించడమే ఇందుకు కారణం. భారత్‌తో పోలిస్తే ఆ దేశాల నుంచి అధిక లాభాలు వస్తున్నాయని సదరు బ్యాంకులు తెలిపాయి.
సాధారణంగానే పండగ సీజన్‌లో భారత్‌లో పసిడికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సరఫరాలో కోత విధించడం ఆందోళన కలిగించే విషయం. దేశీయ అవరాల నిమిత్తం ఇక్కడి విక్రేతలు అధిక ప్రీమియంతో బంగారాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అనివార్యమవుతుంది. ఇదే జరిగితే ఈ పండగ సీజన్‌లో పసిడి ధరలు గణనీయంగా పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్‌కు ఐసీబీసీ స్టాండర్డ్ బ్యాంక్, జేపీ మోర్గాన్, స్టాండర్డ్ ఛార్టెర్డ్ ప్రధానంగా బంగారాన్ని సరఫరా చేస్తుంటాయి. సాధారణంగా ఈ సంస్థలు పండగ సీజన్‌కు ముందు భారీ ఎత్తున పసిడిని దిగుమతి చేసుకొని నిల్వ చేసుకుంటుంటాయి. ఈ సమయానికి వీరి వద్ద టన్నుల కొద్దీ బంగారం ఉండాలి. కానీ, ప్రస్తుతం కొన్ని వందల కిలోల నిల్వలు మాత్రమే ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. దీనిపై ఆయా బ్యాంకులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
కొవిడ్ లాక్‌డౌన్ సమయంలోనూ చైనాలో బంగారానికి గిరాకీ ఏమాత్రం తగ్గలేదు. దీంతో భారత్‌తో పోలిస్తే అక్కడి విక్రేతలు ఎక్కువ మొత్తంలో ప్రీమియం చెల్లిస్తున్నారు. మరోవైపు తుర్కియేలో భారీ ద్రవ్యోల్బణం కారణంగా అక్కడి ప్రజలు బంగారంలో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారు. దీంతో అక్కడి విక్రేతలు కూడా భారీ ప్రీమియంతో పసిడిని కొనడానికి ముందుకు వస్తున్నారు. ఫలితంగా బంగారాన్ని సరఫరా చేసే బ్యాంకులు భారత్ కంటే ఆ రెండు దేశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. సెప్టెంబరు నెలలో భారత్ బంగారం దిగుమతులు 30 శాతం తగ్గాయి. అదే సమయంలో తుర్కియే దిగుమతులు 453 శాతం పెరిగాయి. ఆగస్టులో చైనా దిగుమతులు 40 శాతం పెరగడం గమనార్హం.