Gold Income Tax Rules : అత్యంత ప్రజాదరణ పొందిన లోహాల్లో బంగారం ఒకటి. దీని వ్యక్తిగతంగా వాడుతుంటారు. పెట్టుబడి గానూ వినియోగిస్తారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్‌ది మొదటి స్థానం. ఇది చాలు మనోళ్లకు బంగారమంటే ఎంత ఇష్టమో చెప్పటానికి. ముఖ్యంగా మన ఆడపడుచులు పసిడిని ఎంత ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్షయ తృతీయ లాంటి పండగలు మొదలు.. పెళ్లి, సందర్భం ఏదైనా జువెల్లరీ షాపుల గడప తొక్కాల్సిందే. మన దేశంలో బంగారం లేని ఇల్లు చాలా తక్కువనే చెప్పాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత.. గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆయా నివేదికలు దీన్ని స్పష్టం చేశాయి. మీరు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇంట్లో గరిష్ఠంగా ఎంత వరకు బంగారం నిల్వ చేసుకోవచ్చు?.. పసిడి ద్వారా వచ్చే ఆదాయంపై ఎంత పన్ను విధిస్తారో తదితర విషయాల్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.
Gold Storage Limit In India : జనరల్‌గా మీ ఇంట్లో బంగారం ఉంచుకోవడానికి పరిమితి లేదు. ఎంతైనా ఉంచుకోవచ్చు. కానీ ఒకవేళ ఇన్కమ్ టాక్స్ రైడ్స్ జరిగితే.. మీరు ఆ ఆభరణాలు కొనుగోలు చేయడానికి, గోల్డ్ పెట్టుబడికి ఆదాయం ఎలా వచ్చింది అనే విషయాలు చూపగలగాలి. అన్ని లెక్కలు సరిగ్గా ఉంటేనే పరిమితి లేకుండా ఇంట్లో నిల్వ చేసుకోవచ్చు. లేని పక్షంలో పన్ను కట్టాల్సి ఉంటుంది.
మరోవైపు బంగారం నిల్వపై కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. Central Board of Direct Taxes (CBDT) ప్రకారం.. ఎలాంటి పన్ను చెల్లింపుల గోల లేకుండా, ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేకుండా కొంత బంగారం ఉంచుకోవచ్చు. పెళ్లైన మహిళలు 500 గ్రాములు, పెళ్లికాని మహిళలు 250 గ్రాములు ఉంచుకోవచ్చు. అదే పురుషులు విషయానికి వస్తే.. ఎలాంటి ఆధారాలు చూపించకుండా 100 గ్రాముల బంగారం నిల్వ చేసుకోవచ్చు.