Gold Hallmarking 3rd Phase : బంగారు ఆభరణాలు, కళాఖండాలకు తప్పనిసరిగా హాల్‌మార్కింగ్ చేసే మూడో దశ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 16 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో ఈ మూడో దశ హాల్‌మార్కింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి అమలులోకి వచ్చిందని స్పష్టం చేసింది.
బంగారం స్వచ్ఛతను తెలుపుతుంది!
How To Check Gold Purity :గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం స్వచ్ఛతను ధ్రువీకరిస్తుంది. వాస్తవానికి 2021 జూన్ 16 వరకు బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ఉండాలనే నిబంధన ఉండేది కాదు. దీనితో కేంద్ర ప్రభుత్వం దీనిని దశలవారీగా, తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది.
మూడు దశల్లో..
Gold Hallmarking Phases In India :
- 2021 జూన్ 23న మొదలైన తొలిదశలో దేశంలోని 343 జిల్లాల్లో బంగారు ఆభరణాలు, కళాఖండాలపై గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు.
- 2022 ఏప్రిల్ 4న ప్రారంభమైన రెండో దశలో దేశంలోని 256 + 32 జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు.
- వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకారం, 2023 సెప్టెంబర్ 8న మూడో దశ ప్రారంభమైంది. ఈ దశలో దేశంలోని 55 కొత్త జిల్లాల్లో పసిడి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు.
ఏపీ, తెలంగాణల్లో..
ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాలు, తెలంగాణలోని 4 జిల్లాల్లో ఈ మూడో దశ గోల్డ్ హాల్‌మార్కింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 8తో మొదలైంది.
- ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలు :అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల్ జిల్లాలు.
- తెలంగాణలోని జిల్లాలు : మేడ్చల్ - మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మెహబూబ్‌నగర్.
రాష్ట్రాలు - జిల్లాలు
మూడో దశలో.. బిహార్ - 8, ఆంధ్రప్రదేశ్ - 5, ఉత్తరప్రదేశ్ - 5, మహారాష్ట్ర - 5, తెలంగాణ - 4, హరియాణ - 3, జమ్ము కశ్మీర్ - 3, పంజాబ్ - 3, కర్ణాటక - 3, తమిళనాడు - 3, అసోం - 2, గుజరాత్ - 2, ఝార్ఖండ్ - 2, మధ్యప్రదేశ్ - 2, ఉత్తరాఖండ్ - 2, బంగాల్ - 2, రాజస్థాన్ - 1 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేశారు.
విజయవంతంగా..
BIS Hallmark In India : బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) మొదటి రెండు దశల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. దాదాపుగా ప్రతి రోజూ 4 లక్షల బంగారు ఆభరణాలపై 'హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్' (HUID) హాల్‌మార్క్ వేయడం జరిగింది.