ఆర్థిక, రాజకీయ, ఇతర అనిశ్చితి ఏదైనా కానీయండి. బంగారంలో మదుపు సురక్షితం అనేది చాలామంది విశ్వాసం. చరిత్రను పరిశీలిస్తే.. పసిడి దీర్ఘకాలంలో అన్ని ఇబ్బందులనూ తట్టుకుంటూ స్థిరమైన రాబడులను ఇచ్చినట్లు గమనించవచ్చు. పెట్టుబడి, సంపద రెండింటిగానూ ఇది గుర్తింపు పొందింది. త్వరగా నగదుగా మార్చుకునే సౌకర్యం,ఎలాంటి ఇబ్బందీ లేకుండా రుణం తీసుకునే వీలు మరో ఆకర్షణ. అందుకే, నేరుగా బంగారంలో మదుపు చేయడంతోపాటు, సాంకేతికంగా డిజిటల్ రూపంలోనూ ఇందులో పెట్టుబడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
దీర్ఘకాలం కొనసాగినప్పుడు ఈక్విటీల నుంచి మంచి రాబడులు వస్తాయని చెప్పొచ్చు. మదుపరుల పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు స్థానం ఉండాల్సిందే. కేవలం ఒకే తరహా పథకాల్లో మదుపు చేయడం ఎప్పుడూ సరికాదు. వైవిధ్యం ఉన్నప్పుడే నష్టభయం తగ్గి, ప్రతిఫలం పెరుగుతుంది. మార్కెట్ పతనం అవుతున్నప్పుడు బాండ్లు పెట్టుబడులకు రక్షణ కల్పిస్తాయి. సూచీలు పెరుగుతున్నప్పుడు ఈక్విటీలతో అధిక లాభం ఉంటుంది. చరిత్రను గమనిస్తే.. ఆర్థిక మందగమనం వచ్చినప్పుడు అన్ని రకాల పెట్టుబడులూ ప్రతికూల రాబడులనే ఇచ్చాయి. ఇక్కడ బంగారాన్ని మాత్రం మినహాయించాలి.
2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు షేర్లు, హెడ్జ్ ఫండ్లు, స్థిరాస్తి, కమోడిటీలు అన్నీ ప్రతికూలంగానే స్పందించాయి. డిసెంబరు 2007 నుంచి ఫిబ్రవరి 2009 వరకూ బంగారం ఒక్కటే ఈ మాంద్యాన్ని తట్టుకొని, సానుకూల రాబడులను అందించింది. అందుకే, పెట్టుబడుల్లో వైవిధ్యం కావాలనుకుంటున్న వారు.. ముందుగా పసిడినే పరిశీలనలోనికి తీసుకోవాలి.
భారతీయ మదుపరులకు బంగారంలో మదుపు చేసేందుకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఆభరణాలను పెట్టుబడి దృష్టితో చూడకూడదు. పసిడిలో దీర్ఘకాలంపాటు క్రమానుగతంగా మదుపు చేయాలనుకున్నప్పుడు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లను పరిశీలించాలి.
గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు దేశీయ మార్కెట్లోని పసిడి ధరనే ప్రతిబింబిస్తాయి. మీరు వీటిని కొంటున్నారంటే అర్థం బంగారాన్ని డిజిటల్ రూపంలో కొని, డీమ్యాట్ ఖాతాలో భద్రపరుస్తున్నారన్నమాట.