వైవిధ్యమైన పెట్టుబడులు ఎప్పుడూ శ్రేయస్కరం. ఇందులో బంగారం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చాలామంది బంగారాన్ని నేరుగా కొనేందుకే ఇష్టపడతారు. శుభకార్యాలు, ఇతర అవసరాలకు ఇది తప్పదు. కొన్ని అంచనాల ప్రకారం దేశంలో 27వేల టన్నుల పసిడి ఉంది. ప్రస్తుతం వేగవంతమైన ఆర్థికీకరణను దృష్టిలో ఉంచుకొని, పెట్టుబడిదారుల్లో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఆభరణాలు, నాణేలు రూపంలోనే కాకుండా పెట్టుబడి దృష్టితో గోల్డ్ ఈటీఎఫ్‌ల రూపంలో ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పేరులో ఉన్నట్లే.. ఇవి మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహించే పథకాలు. బంగారం ధరలను ట్రాక్ చేసే నిష్క్రియా పథకాలు. ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ధర బంగారం ఒక గ్రాము లేదా నిర్ణీత మొత్తానికి సరిపోయే విధంగా సర్దుబాటు ఉంటుంది. ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు, అమ్మకాలు సులభంగా నిర్వహించే సౌలభ్యాన్ని అందిస్తాయి.
స్వచ్ఛత: బంగారాన్ని నేరుగా కొనుగోలు చేసినప్పుడు కొన్నిసార్లు స్వచ్ఛత విషయంలో అనుమానాలుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ 99% లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛతతో ఉన్న బంగారం ధరకు మద్దతునిస్తుంది. కాబట్టి, స్వచ్ఛత విషయంలో ఆందోళన అవసరం లేదు.
ఖర్చులు: బంగారాన్ని కొనుగోలు చేసినప్పుడు నిల్వ చేసుకోవడం పెద్ద సమస్య. లాకర్ వంటివాటిని ఎంచుకున్నప్పుడు అదనంగా కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. తయారీ, తరుగు ఇలా పలు ఇతర అంశాలూ ఉంటాయి. ఈటీఎఫ్‌లలో ఇలాంటి ఇబ్బందులు తక్కువ. బంగారం డీమ్యాట్ రూపంలో ఉంటుంది కాబట్టి, భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
సులభంగా:గోల్డ్ ఈటీఎఫ్‌లను సులభంగా కొనుగోలు చేయొచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల పనివేళలో ఎప్పుడైనా యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. విక్రయించవచ్చు.