తెలంగాణ

telangana

ETV Bharat / business

గోఫస్ట్‌ విమాన సేవలకు బ్రేక్.. ప్రయాణికుల ఇబ్బందులు - go first cancels flight

Go First flight cancelled by airline : నిధుల కొరత కారణంగా గోఫస్ట్‌ విమాన సేవలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మే 3, 4 తేదీల్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంజిన్ల సరాఫరాలో ఆలస్యం వల్లే ఇలా జరిగిందని వెల్లడించింది.

go-first-airlines-flights-cancelled-amid-financial-crunch
గోఫస్ట్‌కు నిధుల కొరత.. నిలిచిపోయిన విమాన సేవలు

By

Published : May 2, 2023, 7:07 PM IST

Updated : May 2, 2023, 7:25 PM IST

Go First airlines latest news : వాడియా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థ గోఫస్ట్‌ మే 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నిధుల కొరత కారణంగానే సర్వీసులు నిలివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రాట్‌ అండ్‌ విట్నీ సంస్థ నుంచి ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం వల్లే.. నిధుల కొరత తలెత్తినట్లు గోఫస్ట్‌ సీఈఓ కౌశిక్‌ కోనా తెలిపారు. దాంతోపాటు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ వద్ద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు ఆయన వెల్లడించారు.

సంస్థకు చెందిన 28 విమానాల సేవలు నిలిచిపోయాయని కౌశిక్‌ పేర్కొన్నారు. ప్రాట్‌ అండ్‌ విట్నీ సంస్థ సకాలంలో ఇంజిన్ల సరఫరా చేయలేదన్నారు. అందుకే ఈ పరిస్థితి ఎదురైందని వెల్లడించారు. దీంతో నిధుల కొరత ఏర్పడిందని వివరించారు. కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కౌశిక్​ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్​ సివిల్‌ ఏవియేషన్‌కు తెలియజేసినట్లు కౌశిక్‌ పేర్కొన్నారు. దరఖాస్తును జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఆమోదించినట్లయితే.. విమాన సేవలను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

గో ఫస్ట్‌ విమాన సంస్థకు మొత్తం 55 విమానాలు ఉన్నాయి. దేశీయ విమానయాన మార్కెట్‌లో ఆ సంస్థ.. ప్రస్తుతం (మార్చి నాటికి) 6.9 శాతం వాటాను కలిగి ఉంది. గోఫస్ట్‌కు చెందిన విమానాల్లో సగానికిపైగా ఇంజిన్లలో లోపం వల్ల గత కొంతకాలంగా నిలిచిపోయాయి. ఒప్పందం ప్రకారం సరైన టైంలో అమెరికాకు చెందిన పీడబ్ల్యూ సంస్థ ఇంజిన్లను రిపేర్‌ చేయకపోవడం, అవసరమయ్యే విడిభాగాలను సరఫరా చేయకపోవడమే ఇందుకు కారణం. దీనిపై గోఫస్ట్‌ సంస్థ గతంలో డెలావర్‌ ఫెడరల్‌ కోర్టులో ఫిటిషన్‌ సైతం దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం గోఫస్ట్‌ సంస్థలో దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ప్రయాణికుల అవస్థలు
"ఎలాంటి కారణం లేకుండానే నా గోఫస్ట్​ ఎయిర్​ టికెట్​ బుకింగ్​ రద్దు అయింది. ఇందుకు కారణం ఏంటి?" అని ఓ ప్యాసింజర్​ ప్రశ్నించారు. బుధవారం శ్రీనగర్​ నుంచి దిల్లీ వెళ్లే విమానాన్ని.. ఎలాంటి రీషెడ్యుల్​ లేకుండానే రద్దు చేశారని మరో ప్రయాణికుడు మండిపడ్డారు. గోఫస్ట్​ ఎయిర్​ సేవలు బాగాలేవని, తన డబ్బును తిరిగి చెల్లించాలని సంస్థను డిమాండ్​ చేశారు.

Last Updated : May 2, 2023, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details