World Diesel Crisis: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డీజిల్‌కు ఉన్న ప్రాధాన్యమే వేరు. ట్రక్కులు, బస్సులు, ఓడలు, రైళ్లు నడిచేందుకు.. నిర్మాణ, తయారీ, వ్యవసాయ రంగాల్లో వినియోగించే యంత్రాలకు కావాల్సిన ఇంధనం ఇదే. అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో ఇంటి వెచ్చదనం కోసమూ డీజిల్‌నే ఇంధనంగా ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల విద్యుదుత్పత్తికీ వాడతారు. ఇన్ని రకాల అవసరాలను తీర్చే డీజిల్‌కు రానున్న రోజుల్లో కొరత ఏర్పడనుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. అసలే అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. డీజిల్‌కు కొరత ఏర్పడితే ఆర్థిక వ్యవస్థలకు మరింత ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న శ్రీలంక, పాకిస్తాన్ లాంటి పేద దేశాల పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది.
రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచ దేశాలకు డీజిల్ కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధాన చమురు విపణుల నుంచి సరఫరాలు తగ్గుతున్నాయి. అమెరికా, ఐరోపాల్లో డీజిల్ నిల్వలు కనిష్ఠ స్థాయిలకు చేరుతుండగా, శీతకాలం నేపథ్యంలో ఇంటి వెచ్చదనం కోసం డీజిల్ వినియోగం పెరుగుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతుల నిషేధానికి ఐరోపా కూటమి విధించుకున్న గడువు సమీపిస్తుండటం ఆందోళనను పెంచుతోంది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా తగ్గింది. కొవిడ్-19 లాక్‌డౌన్ ఆంక్షల సమయంలో డిమాండు తగ్గినపుడు, కొన్ని రిఫైనరీలు లాభదాయకత లేని ప్లాంట్లను మూసివేశాయి. దీంతో రిఫైనింగ్ సామర్థ్యమూ పరిమితమైంది. 2020 నుంచి అమెరికాలో రిఫైనింగ్ సామర్థ్యం రోజుకు 10 లక్షల బ్యారెళ్ల మేర తగ్గినట్లు అంచనా. అమెరికాలో డీజిల్, హీటింగ్ ఆయిల్ నిల్వలు నాలుగు దశాబ్దాల కనిష్ఠానికి పడిపోయాయని వార్తలొస్తున్నాయి.