సాధారణంగా బ్యాంకులు దరఖాస్తుదారుల ఆదాయాన్ని ఆధారం చేసుకొని క్రెడిట్ కార్డులు జారీ చేస్తాయి. ఒక వ్యక్తి నెలవారీ ఆదాయం.. వారి తిరిగి చెల్లించే స్తోమతను తెలియజేస్తుంది. అలాగే క్రెడిట్ చరిత్ర ఆర్థిక అంశాల్లో ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారో చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలో ఆదాయం లేకుండా క్రెడిట్ కార్డు పొందడం కష్టమైన విషయమే. అయితే, అసాధ్యమైతే కాదు.
వాస్తవానికి బ్యాంకులు లేదా ఇతర జారీ సంస్థలు దరఖాస్తు చేసుకున్న అందరికీ క్రెడిట్ కార్డు లు ఇవ్వాలనే చూస్తాయి! కానీ, ఆ వ్యక్తికి తిరిగి చెల్లించే స్తోమత లేకపోతే మాత్రం రిస్క్ తీసుకోలేవు. ఎందుకంటే అది వారి వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే కార్డు తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి బిల్లును ఎలా చెల్లిస్తారనేది బ్యాంకులు నిశితంగా పరిశీలిస్తాయి. ఆ తర్వాతే కార్డును జారీ చేస్తాయి.
ఆదాయం లేకుండా ఈ కింది మార్గాల్లో క్రెడిట్ కార్డు పొందొచ్చు..
స్టూడెంట్ క్రెడిట్ కార్డు..
కొన్ని సంస్థలు విద్యార్థులకు కూడా క్రెడిట్ కార్డులు అందజేస్తున్నాయి. తక్కువ క్రెడిట్ పరిమితితో దీన్ని ఇస్తాయి. ప్రత్యేకంగా విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాయి. అయితే, దీనికోసం ఏదో ఒకటి తనఖా పెట్టాల్సి ఉంటుంది. ఏదైనా పార్ట్-టైం ఉద్యోగం చేస్తున్నట్లయినా చూపించాలి. లేదంటే ఫిక్స్‌డ్ డిపాజిట్, పొదుపు ఖాతాను చూపించి తీసుకోవాలి. సాధారణ క్రెడిట్ కార్డుల్లా స్టూడెంట్ కార్డుల్లో అన్ని వెసులుబాట్లు ఉండవు. ప్రవేశ రుసుము, వార్షిక ఫీజులు నామమాత్రంగా ఉంటాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై కార్డు..
ఆదాయం లేకుండా క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకునే చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను ఆధారం చేసుకుంటారు. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్మును తనఖా పెట్టి కార్డు తీసుకుంటున్నారన్నమాట! దీన్నే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు అంటారు. ఎఫ్‌డీ మొత్తంలో 75-90 శాతాన్ని క్రెడిట్ కార్డు పరిమితిగా విధిస్తారు.
మ్యూచువల్ ఫండ్స్ ఆధారంగా..
ఫిక్స్‌డ్ డిపాజిట్ తరహాలోనే మ్యూచువల్ ఫండ్లను చూపించి కూడా క్రెడిట్ కార్డును తీసుకోవచ్చు. ఇది కూడా సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు పరిధిలోకే వస్తుంది. ఒకవేళ బిల్లు ఎగ్గొట్టినట్లయితే.. బ్యాంకులు మ్యూచువల్ ఫండ్ల నుంచి వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది.