Germany Recession 2023 : జర్మనీ ఆర్థికమాంద్యంలోకి జారుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం భారత్‌పై కూడా పడనుంది. భారత్ నుంచి ఐరోపాకు జరిగే ఎగుమతుల్లో కోత పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జర్మనీలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి 0.3శాతం పడిపోయింది. 2022 నాలుగో త్రైమాసికంలోనూ 0.5శాతం క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ మందగమనానికి గురైతే దానిని ఆర్థికమాంద్యంగా పేర్కొంటారు. దీని వల్ల ఒక్క జర్మనీకే కాకుండా మొత్తం ఐరోపా దేశాలకు భారత్ నుంచి అయ్యే ఎగుమతులపై ప్రభావం పడుతుందని ముంబయికి చెందిన ప్రముఖ ఎగుమతిదారు తెలిపారు.
2022- 23లో భారత్ నుంచి జర్మనీకి 10.2 బిలియన్ డాలర్లు విలువ చేసే ఎగుమతులు నమోదయ్యాయి. ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఈ విలువ పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తోలు ఉత్పత్తులు, కెమికల్, లైట్ ఇంజినీరింగ్ వస్తువులపై ప్రభావం అధికంగా ఉండనుంది. దాదాపు రెండు బిలియన్ డాలర్లు విలువ చేసే ఎగుమతులపై ప్రభావం ఉండొచ్చని జీటీఆర్‌ఐ సహ-వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుందన్నారు. రోజువారీ వినియోగించే వస్తువులపై ఆర్థిక మాంద్యం సమయంలో అధిక ప్రభావం ఉంటుందని తెలిపారు. త్వరలో అమల్లోకి రానున్న కార్బన్ బార్డర్ ట్యాక్స్ వల్ల ఇనుము, ఉక్కు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం ఉంటుందన్నారు.