16 ఏళ్ల వయసులోనే చదువు వదిలేసిన ఆయన.. 1978లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎక్కి ముంబయి వచ్చేశారు. మూడేళ్ల తర్వాత జపాన్ కొనుగోలుదారుడితో వజ్రాల వ్యాపారం చేసి రూ.10,000 కమీషన్ పొందారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగా, ప్రస్తుతం ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ఎదిగారు. ఆయన ఎవరో కాదు.. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ. అయితే కళాశాల విద్యను పూర్తి చేయనందుకు అదానీ పశ్చాతాపం వ్యక్తం చేశారు.
'కళాశాల చదువు పూర్తి చేసుండాల్సింది'.. డైమండ్ జూబ్లీ వేడుకల్లో గౌతమ్ అదానీ పశ్చాత్తాపం! - గౌతమ్ అదానీ చదువు గురించి కీలక వ్యాఖ్యలు న్యూస్
అపర సంపన్నుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ... కళాశాల విద్య పూర్తి చేయనందుకు విచారం వ్యక్తం చేశారు. జీవితంలో అనుభవాలు పాఠాలు నేర్పినప్పటికీ విద్యతోనే పరిపూర్ణమైన జ్ఞానం వస్తుందని అన్నారు. గుజరాత్‌లోని పాలన్పూర్ విద్యామందిర్ ట్రస్ట్... డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన గత స్మృతులను నెమరు వేసుకున్నారు.
ప్రారంభంలో ఎదురైన అనుభవాలు తనను తెలివైనవాడిగా మార్చాయని, కానీ విద్యతో వ్యక్తుల విజ్ఞానం మరింత వేగంగా పెరుగుతుందని అన్నారు. గుజరాత్‌లోని విద్యామందిర్ ట్రస్ట్ పాలన్‌పూర్ 75వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అదానీ గ్రూప్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ కంపెనీగా, అతిపెద్ద విమానాశ్రయ, నౌకాశ్రయ నిర్వహణ సంస్థగా, అతిపెద్ద ఇంధన సంస్థగా, దేశంలో రెండో అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థగా నిలబెట్టిన క్రమాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. నాలుగున్నర దశాబ్దాల కాలవ్యవధిలో 225 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.18.45 లక్షల కోట్ల) వ్యాపార సామ్రాజ్యాన్ని అదానీ నిర్మించారు.
- గుజరాత్ బనాస్‌కాంతలోని కఠిన జీవన పరిస్థితులు తనను దృఢంగా మలిచాయని, తండ్రి నుంచి ‘ఫార్వర్డ్ ట్రేడ్స్’ మెళకువలు నేర్చుకున్నట్లు అదానీ తెలిపారు. బనాస్‌కాంత నుంచి అహ్మదాబాద్ చేరుకున్న అదానీ, పాఠశాల విద్యను పూర్తి చేయడానికి నాలుగేళ్లు అక్కడే ఉన్నారు.
- 16 ఏళ్ల వయసులోనే చదువును విడిచిపెట్టి అదానీ ముంబయి చేరుకున్నారు. టీనేజీ కుర్రాడిగా స్వతంత్రంగా జీవించేందుకు, ఏదైనా ప్రత్యేకంగా చేయాలన్న తపనతోనే కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చినట్లు తెలిపారు. ముంబయిలో బంధువు ప్రకాశ్‌భాయ్ దేశాయ్ సాయంతో మహేంద్ర బ్రదర్స్‌లో చేరి వజ్రాల వ్యాపారాన్ని నేర్చుకోవడం ప్రారంభించారు. మూడేళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత సొంతంగా వజ్రాల ట్రేడింగ్‌లో బ్రోకరేజీని ప్రారంభించారు. మొదటి లావాదేవీలో రూ.10000 కమీషన్ సంపాదించిన క్షణాన్ని మర్చిపోలేనని, అక్కడ నుంచే తన వ్యాపార ప్రయాణం ప్రారంభమైందని అదానీ చెప్పుకొచ్చారు.
- తొలినాళ్లలో అహ్మదాబాద్‌లో కొనుగోలు చేసిన చిన్నస్థాయి పీవీసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ నడపడానికి పెద్ద సోదరుడు మహసుఖ్‌భాయ్ తోడ్పాటు అందించారన్నారు. దిగుమతి ఆంక్షలతో ముడివస్తువులకు తీవ్రమైన కొరత ఉండేదని, 1985లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ దిగుమతి విధానాల సరళీకరణతో కలిసొచ్చిందని తెలిపారు.
- 1991లో పీవీ నరసింహరావు హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలతో పాలీమర్స్, లోహాలు, జౌళి, వ్యవసాయ ఉత్పత్తులను నిర్వహించే పూర్తిస్థాయి ట్రేడింగ్ సంస్థగా ఎదిగామని అదానీ వెల్లడించారు. అప్పటివరకు ట్రేడింగ్‌పైనే దృష్టిపెట్టిన ఆయన.. 1994లో అదానీ ఎక్స్‌పోర్ట్స్ (ఇప్పుడు అదానీ ఎంటర్‌ప్రైజెస్)ను స్టాక్ మార్కెట్‌లో నమోదుచేశారు.
- అనంతరం 1995లో సముద్రతీరాన్ని అభివృద్ధి చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించడం ద్వారా మరో అవకాశం లభించిందన్నారు. ముంద్రాలో పూర్తిస్థాయి వాణిజ్య పోర్టు నిర్మించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదని గుర్తుచేసుకున్నారు. వచ్చే 30 ఏళ్లలో భారత్‌లో భారీ అవకాశాలు ఉన్నాయని, కలలు సాకారం చేసుకోవడానికి ఇదే మంచి సమయమని అన్నారు.
- ఇవీ చదవండి:
- మీ ఎదుగుదల మోదీ వల్లేనా?.. అదానీ సమాధానమిదే..
- స్టాక్ మార్కెట్‌లో మదుపు చేశారా?.. నష్టం భరిస్తేనే అధిక రాబడి!