Gautam Adani net worth: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద అత్యంత వేగంగా పెరుగుతోంది. సరిగ్గా పదేళ్ల క్రితం ముకేశ్ అంబానీ సంపదలో ఆరోవంతు సంపద కలిగిన అదానీ.. ఇప్పుడు ముకేశ్‌ను దాటి చాలా ముందుకెళ్లారు. ప్రపంచ కుబేరుల్లో ఏకంగా రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 10 లక్షల 94 వేల కోట్ల రూపాయల సంపదతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అవతరించారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఈ మేరకు 2022కు సంబంధించి భారత్‌లో అత్యంత ధనికుల జాబితాను ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ వెల్లడించింది.
డబ్బే డబ్బు.. అదానీ సంపాదన రోజుకు రూ.1,600 కోట్లు.. మొత్తం ఎంతంటే? - అదానీ వార్తలు
బ్లూమ్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద... గత ఏడాది 116 శాతం పెరిగినట్లు 'ఐఐఎఫ్ఎల్ వెల్త్' జాబితా వెల్లడించింది. గత ఏడాది రోజుకు సగటున రూ.1,612 కోట్లు అదానీ ఆర్జించినట్లు తెలిపింది. మొత్తంగా రూ.10.94లక్షల కోట్ల సంపదతో దేశంలోనే అత్యంత కుబేరుడిగా అదానీ అవతరించినట్లు వెల్లడించింది.
గడిచిన ఏడాది గౌతమ్ అదానీ సంపద 116 శాతం పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ తెలిపింది. అంటే సగటున రోజుకు 1612 కోట్ల రూపాయల చొప్పున సుమారు 5 లక్షల 88 వేల కోట్ల మేర సంపద పెరిగిందని పేర్కొంది. గత పదేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీని గౌతమ్ అదానీ దాటేశారు. ప్రస్తుతం ముకేశ్ సంపద 7 లక్షల 94 వేల కోట్లుగా ఉంది. గడిచిన ఏడాది... ముకేశ్ సంపద 11 శాతం పెరగ్గా.. ఐదేళ్లలో 115 శాతం పెరిగినట్లు ఐఐఎఫ్ఎల్ వెల్త్ పేర్కొంది.
కొవిడ్ వ్యాక్సిన్ల తయారీతో తెరపైకి వచ్చిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత సైరస్ ఎస్ పూనావాలా సంపద సైతం భారీగా పెరిగింది. గడిచిన ఏడాదిలో పూనావాలా ఆస్తి 25 శాతం వృద్ధి చెంది 2 లక్షల 5 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఈ జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివనాడార్, డీమార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణన్ దమానీ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.