ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, రూపాయి క్షీణత, ఉద్యోగ కోతలు, మాంద్యం భయాలు.. ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాటలివీ. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అదే సమయంలో భారత్‌లో కుబేరుల సంపద రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో టాప్-100 సంపన్నుల మొత్తం సంపద విలువ 800 బిలియయన్ డాలర్లకు (రూ.62 లక్షల కోట్లుపైనే) చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే వీరి సంపద 25 బిలియన్ డాలర్లు మేర పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ మేరకు టాప్-100 జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్ అంబానీ రెండోస్థానంలో నిలిచారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకోగా.. పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తన స్థానాన్ని కోల్పోయారు.
భారత్‌లో అత్యంత సంపన్నుడిగా అదానీ.. టాప్-100లో 30% సంపద వారిద్దరి వద్దే! - దేశంలో టాప్ 100 కుబేరుల సంపద
భారత్‌లో కుబేరుల సంపద రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో టాప్-100 కుబేరుల సంపద 25 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద మొత్తం 150 బిలియన్ డాలర్లు (రూ. 1,211,460.11 కోట్లు)గా ఫోర్బ్స్ పేర్కొంది. టాప్-100 కుబేరుల మొత్తం సంపద విలువ పెరగడంలో అదానీ పాత్ర కీలకమని తెలిపింది. ఆయన సంపద ఈ ఒక్క ఏడాదిలోనే రెట్టింపైందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ జాబితాలో ముకేశ్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద 88 బిలియన్ డాలర్లు (రూ.710,723.26 కోట్లు)గా ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయన సంపద 5 శాతం మేర తగ్గినట్లు తెలిపింది. టాప్-100 మొత్తం సంపదలో అదానీ, అంబానీ వాటానే దాదాపు 30 శాతంగా ఉండటం గమనార్హం.
ఇక ఈ జాబితాలో నైకా ఫ్యాషన్స్ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. వేదాంత ఫ్యాషన్స్ వ్యవస్థాపకుడు రవి మోదీ, మెట్రో బ్రాండ్ వ్యవస్థాపకుడు రఫిక్ మాలిక్ సైతం తొలిసారి ఈ జాబితాలో చోటు సాధించారు. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరణంతో ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా పేరు ఈ జాబితాలో చేరింది. వీరితో పాటు ఆనంద్ మహీంద్రా, బర్దేశ్ షా, జాయ్ అలుక్కాస్ వంటి వారు తిరిగి ఈ జాబితాలో చోటు సాధించారు. పేటీఎం షేర్లు పడిపోయిన నేపథ్యంలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఈ జాబితాలో చోటు కోల్పోయారు.