Adani Richest Man : నికర సంపదలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. తాజాగా ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రమే ఉన్నారని ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ సూచీ వెల్లడిస్తోంది. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి అదానీ రెండో స్థానానికి ఎగబాకారు. ఈ స్థాయికి చేరిన తొలి భారత, ఆసియా వ్యక్తి అదానీయే. స్టాక్ మార్కెట్ కదలికలకు అనుగుణంగా కుబేరుల సంపద ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో జాబితాలోని వ్యక్తుల స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.
ఫోర్బ్స్ వివరాల ప్రకారం.. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు శుక్రవారం రాణించాయి. దీంతో ఆయన సంపద 5.5 బిలియన్ డాలర్లు పెరిగింది. 155.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరారు. విలాస వస్తువుల కంపెనీ ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 155.2 బి.డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జెఫ్ బెజోస్ 149.7 బి.డాలర్లతో నాలుగో స్థానానికి చేరారు. భారత్‌కు చెందిన మరో కుబేరుడు ముకేశ్ అంబానీ ఈ జాబితాలో 92.3 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు.
గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌లోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.20.11 లక్షల కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్‌లో మొత్తం 7 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. వీటిలో నాలుగు సంస్థల షేరు ధర ఈ కేలండర్ ఏడాదిలో రెండింతలకు పైగా పెరిగింది. ఈ ఏడాది అదానీ సంపద 72 బిలియన్ డాలర్లకు పైగా ఎగబాకింది. తొలి పది మంది కుబేరుల్లో 2022లో అదానీ, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద మాత్రమే పెరగడం విశేషం.