Gas Prices Hike : ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సామాన్య ప్రజలకు షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.7 వరకు అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనితో దిల్లీలో 19కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1773 నుంచి రూ.1780కు పెరిగింది. అయితే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలను మాత్రం స్థిరంగానే ఉంచాయి ఆయిల్ సంస్థలు.
పెరిగిన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు
Commercial LPG Cylinder Price : సామాన్యంగా ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ రేట్లలో మార్పు చేసే ఆయిల్ కంపెనీలు.. ఇప్పుడు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాయి. గ్యాస్ సిలిండర్లపై పెంచిన ధరలు జులై 1 నుంచే అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రూ.1725 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1732కు పెరిగింది. అలాగే కోల్కతాలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1875.50 నుంచి రూ.1882.50 చేరింది. చెన్నైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1937 నుంచి రూ.1944కు పెరిగింది. పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరల వల్ల మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా దుకాణదారులు, హోటల్ యజమానులపై ఈ గ్యాస్ ధరల పెరుగుదల భారం పడనుంది.